
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారి పుట్టలో పాలు పోశారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకునే భక్తులు అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొంటే మేలు జరుగుతుందనే విశ్వాసం ఉంది.
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారు జాము వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆలయ కమిటీ వారు ఆలయంలో సోలార్ విద్యుత్ సదుపాయం, కల్పిచడం, ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే నెలలో
షార్ట్ ఫిలిం పోటీలు
పాలకొల్లు సెంట్రల్: తెలుగు సాహిత్యం, సంస్కృతిని ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక రోటరీ క్లబ్ భవనంలో మాట్లాడుతూ.. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిషత్‌కు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తున్నారన్నారు. సంఘ పరిషత్ సభ్యులుగా కెఎస్‌పిఎన్ వర్మ, కె.రాంప్రసాద్, చేగొండి సత్యనారాయణమూర్తి, రాజా వన్నెంరెడ్డి, గుడాల హరిబాబు, బోణం వెంకట నర్సయ్య, విన్నకోట వెంకటరమణ, యిమ్మిడి రాజేష్‌ను నియమించినట్లు తెలిపారు. పోటీలు ఆగస్టు నెలాఖరులో నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 10 లోపు అప్లికేషన్స్ పంపించాలన్నారు. ఫిలిం 15 నిమిషాలు మించి ఉండరాదని అన్నారు. పోటీలకు దర్శకులు వీర శంకర్, రేలంగి నరసింహరావు, రాజా వన్నెంరెడ్డి, ఏఎన్ ఆదిత్య, రచయిత రాజేంద్రకుమార్‌లు జడ్జిలుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు.

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు