
గురుకుల విద్య.. భద్రత మిథ్య
భీమడోలు: అధికారుల నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థినుల పాలిట శాపంగా మారింది. శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే గురుకుల విద్య తరగతులు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో గుబులు రేపుతోంది. ఏ క్షణాన ఏ భవనం కూలిపోతుందోనని, తమ పిల్లల పరిస్థితి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలసానిపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల భవనంలోని రెండు ల్యాబ్‌లకు చెందిన శ్లాబ్‌లు మే 30వ తేదీన రాత్రి సమయంలో కూలిపోయాయి. అయితే వేసవి సెలవులు కావడం, రాత్రి పూట కూలడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ నేపథ్యంలో విద్యార్థినుల భద్రతపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో సంబంధిత గురుకుల సొసైటీ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. పాత భవనాలు క్షేమం కాదని కళాశాలను తాత్కాలికంగా వేరే ప్రదేశానికి మార్చాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. భీమడోలు, ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల్లో ఎక్కడైనా అద్దె భవనాన్ని తీసుకుని విద్యార్థినులకు తరగతులు నిర్వహించేలా తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.
బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ
పోలసానిపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 710 మంది విద్య అభ్యసిస్తున్నారు. టీచర్లు, కార్యాలయ సిబ్బంది, ఇతర సిబ్బందితో కలిసి 100 మందికి పైగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరడం, తరచూ వంటశాల, భోజన శాల, డార్మిటరీల్లో శ్లాబ్‌లు ఊడి కింద పడుతుండడం, అంతేగాకుండా హాస్టల్ ఆవరణలో విష సర్పాలు సంచరించడంతో విద్యార్థినులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో జూన్ 12వ తేదీ నుంచి తరగతులు పునఃప్రారంభమైనా విద్యార్థినులను ఎక్కువ మంది ఇక్కడ చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఏడు వందల మందికిగాను కేవలం 180 మంది బాలికలు మాత్రమే హాజరవుతున్నారు.
బడ్జెట్ కేటాయింపులేవి?
ప్రతి ఏటా గురుకులాల్లో మౌలిక వసతులు, మరమ్మతులకు బడ్జెట్‌లో గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు నిధులు కేటాయించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్నా శిథిలావస్థకు చేరిన భవనాలకు కనీసం మరమ్మతులు నిర్వహించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూలిన రెండు ల్యాబ్‌లు (ఫైల్)
పోలసానిపల్లి గురుకులంలో శిథిలావస్థకు చేరిన భవనాలు
విద్యార్థినుల భద్రత దృష్ట్యా వేరే ప్రాంతానికి తరలింపు చర్యలు
రాష్ట్ర స్థాయి అధికారుల నిర్ణయం కోసం ఎదురు చూపు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం
పోలసానిపల్లి గురుకుల కళాశాల పరిస్థితిపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు డీసీవో బి.ఉమాకుమారి తెలిపారు. కళాశాలను వేరే ప్రాంతానికి తరలించే నిర్ణయంపై వారం రోజుల్లో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే భవనాల్లోని పటుత్వాన్ని గుర్తించేందుకు ఉన్నతాధికారులతో సంప్రదిస్తుమని, వారిచ్చే నివేదికను సొసైటీ ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా తమ వంతు కృషి చేస్తున్నామని, బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందనవసరం లేదని వెల్లడించారు.

గురుకుల విద్య.. భద్రత మిథ్య

గురుకుల విద్య.. భద్రత మిథ్య

గురుకుల విద్య.. భద్రత మిథ్య