
పోలవరంపై చంద్రబాబు వాస్తవాలు బయట పెట్టాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
చింతలపూడి : పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు వాస్తవాలు బయటపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. చింతలపూడిలో ఏలూరు జిల్లా సీపీఐ ద్వితీయ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం ఎత్తు 41.15 మీటర్లు తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వమే తెలిపిందని, దీనిపై చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పోలవరం నివాసితులకు న్యాయం జరిగే వరకూ ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. చంద్రబాబు ఇప్పుడు కొత్తగా పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు అంటూ ప్రజలను ఏమారుస్తున్నారన్నారు.
సూపర్ సిక్స్ ఎక్కడ బాబూ
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 ఏళ్లపాటు రూ.1.10 లక్షల కోట్ల భారాన్ని విద్యుత్ చార్జీల పెంపు రూపంలో ప్రజలపై ప్రభుత్వం మోపుతుందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేస్తే తప్పు అన్న చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఎందుకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయాల్సి వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించగా జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి కేవీపీ ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు, మండల కార్యదర్శి టి.బాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో కాలువలో పడి రౌడీషీటర్ మృతి
ఏలూరు టౌన్: ఏలూరు వన్‌టౌన్ పరిధిలో ఒక రౌడీషీటర్ మద్యం మత్తులో ఒక మురికి కాలువలో పడి ఊపిరాడక మృతిచెందాడు. వివరాల ప్రకారం.. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలోని వంగాయగూడేనికి చెందిన బలిరెడ్డి విజయసాయి (36) సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. విజయసాయిపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ప్రస్తుతం రౌడీషీట్ కొనసాగుతోంది. మద్యం సేవించిన సాయి శనివారం తెల్లవారుజామున వంగాయగూడెం వైపు నుంచి వస్తూ అక్కడి మురికి కాలువపై ఉన్న గట్టుపై పడుకున్నాడు. పూటుగా మద్యం సేవించి ఉండడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడి ఊపిరాడక మృతిచెందాడు. ఈ విషయంపై పోలీసులు సీసీ కెమెరాల పుటేజ్ పరిశీలించి మృతుడు కాలువ గట్టుపై పడుకుని ప్రమాదవశాత్తు జారిపడినట్లు గుర్తించారు. అనంతరం సాయి మృతదేహానికి జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఏలూరు వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై నాగబాబు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలవరంపై చంద్రబాబు వాస్తవాలు బయట పెట్టాలి