
ప్రేమ వివాహం.. గ్రామాల మధ్య వివాదం
ప్రేమికుడిపై దాడి చేసిన యువతి బంధువులు
కై కలూరు: ఓ ప్రేమ వివాహం ఇరు గ్రామాల మధ్య వివాదానికి దారితీసింది. ప్రేమికుడు, అతని బంధువులపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కై కలూరులో శనివారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కై కలూరు మండలం చటాకాయి గ్రామానికి చెందిన ఘంటసాల రోజాకుమార్(22), నత్తగుళ్ళపాడు గ్రామానికి చెందిన నబిగారి లక్ష్మీ ప్రసన్న(22) కై కలూరు కాలేజీలో చదువుతూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రోజాకుమార్ కుటుంబం కొన్ని నెలలుగా నెల్లూరులో చేపల చెరువులు సాగు చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఇంట్లో వివాహం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రసన్న చెప్పడంతో రోజాకుమార్ ఆమెను తీసుకువెళ్లి నెల్లూరు సమీప బుచ్చిరెడ్డిపాలెం కామాక్షి దేవాలయంలో తాళి కట్టి దండలు మార్చుకున్నారు. అక్కడ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. విషయం తెలుసుకున్న రోజాకుమార్ గ్రామ పెద్దలు కారులో ప్రేమ జంటను తీసుకువస్తుండగా రాత్రి సమయంలో ఒంగోలు వద్ద యువతికి చెందిన నత్తగుళ్ళపాడు గ్రామస్తులు తారసపడ్డారు. అందరూ కలసి వస్తుండుగా ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు వంతెన వద్ద యువతి మేనమామ ఘంటసాల చందు, బంధువులు మరో నలుగురు బయట వ్యక్తులతో కలిసి యువకుడి కారుపై దాడి చేసి యువతిని తీసుకువెళ్లారు. ఈ దాడిలో రోజాకుమార్‌తోపాటు చటాకాయికి చెందిన ఘంటసాల సుబ్బరాజు, ముంగర గంగాథరరావు, జల్లూరు శ్రీను, ఘంటసాల నారాయణ, డ్రైవర్ సైదు హేమ కిరిటీలకు దెబ్బలు తగిలాయి. వీరు కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరగా వీరిని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, వడ్డి కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బలే ఏసురాజు పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి వద్ద, పోలీసు స్టేషన్ వద్ద ఇరు గ్రామాల పెద్దలు గొడవకు దిగారు. ఈ విషయంపై కై కలూరు రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్ మాట్లాడుతూ బయట వ్యక్తులు దాడి చేసిన ప్రాంతం శ్రీపర్రు కావడంతో అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారన్నారు. తల్లిదండ్రులతోనే ఉంటానని యువతి చెప్పడంతో ఇరు గ్రామస్తులతో మాట్లాడామన్నారు. విభేదాలు పడవద్దని గ్రామస్తులకు తెలిపామన్నారు.