
తొలి ఏకాదశి.. పుణ్యాల రాశి
ద్వారకాతిరుమల: ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని పిలుస్తారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఆదివారం తొలి ఏకాదశి కాగా పండుగ విశిష్టతను శ్రీవారి దేవస్థానం ఆగమ పండితులు సుదర్శనం శ్రీనివాసాచార్యులు మాటల్లో తెలుసుకుందాం.
తొలి ఏకాదశి విశిష్టత
ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు (కార్తీక మాసం శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) వరకు) విష్ణుమూర్తి పాలకడలిపై నిద్రిస్తారు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లోనూ ఈ రోజు మొదటిది. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకోసం దశమి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే తొలి ఏకాదశి వ్రతం అని అంటారు. ఈ రోజున అన్నం, మాంసాహారం తినకూడదు. తులసి ఆకులు కోయడం, జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం, గొడవలు, దుర్భాషలాడటం, పగలు నిద్రపోవడం, ఇతరులను అవమానించడం, చెడుగా ఆలోచించడం, దానం నిరాకరించడం వంటివి చేయరాదు.
శ్రీవారి క్షేత్రంలో..
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. అందులో భాగంగా రాత్రి స్వామివారి గ్రామోత్సవం క్షేత్ర పురవీధుల్లో కన్నుల పండువగా జరుగనుంది. తొలి పండుగ కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నేడు శ్రీవారి క్షేత్రంలో ప్రత్యేక పూజలు