
26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నూజివీడు: మండలంలోని మొర్సపూడిలో అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ డీటీ జీ వెంకటేశ్వరరావు, వీఆర్వో నాగరాజు గ్రామస్తులతో కలిసి శనివారం పట్టుకున్నారు. రేషన్ షాపులోని బియ్యాన్ని ట్రక్కు వాహనంలోకి లోడు చేస్తుండగా గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన మొర్సపూడికి చేరుకొని ట్రక్కు వాహనంలో ఉన్న 26 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రేషన్ డీలర్ గొడవర్తి అచ్చయ్య, రేషన్ బియ్యం అక్రమ వ్యాపారి సోలా రాములపై 6ఏ కేసు నమోదు చేశారు.
అనుమతి లేని బస్సులపై అపరాధ రుసుం
తాడేపల్లిగూడెం: అనుమతులు లేకుండా నడుపుతున్న విద్యాసంస్థలకు చెందిన బస్సులకు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు జరిమానా విధించారు. డీటీఓ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. పిప్పర పరిధిలోని స్కూల్స్ బస్సుల్లో ఒకటి టాక్స్ లేకుండా, మరొకటి ఎఫ్‌సీ లేకుండా తిరుగుతున్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు ఆ బస్సుల యజమానుల నుంచి రూ.39 వేల అపరాధ రుసుంను వసూలు చేశారు. గూడెం మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ నాయక్, అసిస్టెంటు ఇన్‌స్పెక్టర్ సుబ్బలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.