
మందుల షాపుల్లో తనిఖీలు
కొయ్యలగూడెం: మండలంలోని పలు మెడికల్ షాపుల్లో శనివారం ఏలూరు నుంచి వచ్చిన డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ ఆలీ షేక్ నేతృత్వంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కన్నాపురం రోడ్డులోని మురళీకృష్ణ మెడికల్స్ షాపులో తనిఖీలు నిర్వహించి ఆరు రకాల నిషేధిత ఔషధాలను స్వాధీనం చేసుకొని షాపును సీజ్ చేశారు. అలాగే బుట్టాయగూడెంలోని లక్ష్మీ దుర్గ మెడికల్ స్టోర్స్, కార్తికేయ మెడికల్ స్టోర్స్, కృష్ణ మెడికల్ స్టోర్స్‌లలో కూడా తనిఖీలు జరిపారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ ఆలీ షేక్ మాట్లాడుతూ ఓ వ్యక్తి ముసుగు, కళ్లజోడు ధరించి బండిపై తిరుగుతూ ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలోని పలు మెడికల్ షాపులకు నిషేధిత ఔషధాలను (వయాగ్రా టాబ్లెట్లు, అబార్షన్ కిట్లు) సరఫరా చేస్తున్నాడని, అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.