
ఆన్‌లైన్ బిజినెస్ పేరిట మోసం
ఏలూరు టౌన్: ఆన్‌లైన్ బిజినెస్ పేరుతో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. ఆమె నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా సొమ్ములు కాజేశారు. తాను మోసపోయాయని గ్రహించిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించగా కేసును ఛేదించి సొమ్ము రికవరీ చేశారు. ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక మహిళ సోషల్ మీడియాలో వాట్సాప్, టెలీగ్రామ్ గ్రూపుల్లో వచ్చిన ట్రేడింగ్, బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ పేర్లతో అధిక లాభాలు వస్తాయనే ఆశతో సొమ్ములు పెట్టుబడి పెట్టింది. బాధిత మహిళ నుంచి రూ.2,56,000 సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసు 290/2024 సెక్షన్ 318(4) బీఎన్‌ఎస్, 66(సీ)(డీ) ఐటీ యాక్ట్ నమోదు చేశారు. ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్‌కుమార్, ఎస్సై మధు వెంకటరాజా ఆధ్వర్యంలో సైబర్ సెల్ సీఐ దాసు, మహిళా ఎస్సై వల్లీపద్మ కేసును ఛేదించారు. సొమ్మును ఫ్రీజ్ చేయించి, తిరిగి రికవరీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. ఏదైనా ఆన్‌లైన్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని చెప్పారు. నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
రూ.2.56 లక్షలు పొగొట్టుకున్న మహిళ
కేసును ఛేదించి సొమ్ము రికవరీ చేసిన పోలీసులు
మహిళకు సొమ్ము అందజేసిన ఎస్పీ