
గడువు తీరిన కందిపప్పు సరఫరా
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి జూలై నెలకు సంబంధించిన అంగన్‌వాడీ సరుకుల్లో గడువు తీరిన కందిపప్పును రేషన్ దుకాణాలకు చేరవేశారు. ప్రతినెలా రేషన్ దుకాణాలకు చెందిన సరుకులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు చెందిన బియ్యం, కందిపప్పు, నూనె ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి సరఫరా చేస్తారు. అయితే ఈనెల పంపిన సరుకుల్లో కందిపప్పు ప్యాకెట్లు గడువు తీరిపోయినట్టు అంగన్‌వాడీ అధికారులు గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం మండలంలోని 54 రేషన్ దుకాణాలకు గత నెల 20 నుంచి అంగన్‌వాడీ సరుకులతో పాటు కందిపప్పును కూడా పంపించేశారు. కందిపప్పు ప్యాక్ చేసిన 5 నెలలలోపు వాడాలని ప్యాకెట్‌పై రాసి ఉంది. గత నెలలో డిసెంబర్‌లో ప్యాక్ చేసిన కందిపప్పును అంగన్‌వాడీ కేంద్రాలకు పంపగా అంగన్‌వాడీ అధికారులు గుర్తించి మార్చి తీసుకువచ్చారు. ఈ నెలలోనూ జనవరి నెలలో ప్యాక్ చేసిన కందిపప్పు ప్యాకెట్లను పంపించారు. ఈ కందిపప్పునూ వెనక్కి పంపాలని ఎంఎల్‌ఎస్ పాయింట్ అధికారులు డీలర్లకు తెలిపారు. గడువు తీరిన కందిపప్పును డీలర్లకు పంపడం విమర్శలకు తావిస్తోంది. కాగా కొత్త కందిపప్పు కూడా ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు చేరుకుందని అధికారులు తెలిపారు.