క్షీరారామంలో కార్తీక పున్నమి పూజలు | Sakshi
Sakshi News home page

క్షీరారామంలో కార్తీక పున్నమి పూజలు

Published Mon, Nov 27 2023 1:16 AM

- - Sakshi

పాలకొల్లు సెంట్రల్‌ : కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం వేకువజామున కాలువస్నానాలు ఆచరించిన మహిళలు కాలువ గట్టున కార్తీకదీపాలను వెలిగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీకదీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి నూతన వధువులు పువ్వు, పిందె, 11 కాయలతో ఉన్న అరటిపళ్లు, కొబ్బరి బొండాలు, బియ్యం, కందగొడుగు, పసుపు గొడుగులతో స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో దీపాలు వెలిగించారు. అలాగే సాలగ్రామ, దీపం, వస్త్రం, గోదానాలు చేశారు. మహిళలు ఉదయం నుంచి ఉపవాసం ఉండి స్వామివారిని దర్శించుకుని ఆరుబయట పూజలు చేసి పున్నమి చంద్రుడిని అద్దంలో చూసి అనంతరం ప్రసాదం స్వీకరించారు. యునైటెడ్‌ కాపు వనిత క్లబ్‌ ఆధ్వర్యంలో, ధర్మపరిరక్షణా సమితి అధ్యక్షుడు గాదె వెంకన్న ఆధ్వర్యంలో 1984 పదో తరగతి పూర్వ విద్యార్థులు ప్రసాదం పంపిణీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌వీ రమణ క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఎంఈవో గుమ్మళ్ల వీరాస్వామి పాల్గొన్నారు. దాతలు శ్రీ వేంకటేశ్వర మెడికల్‌ హాల్‌, మంతెన రామారావు కుటుంబ సభ్యులు, క్షీరారామలింగేశ్వరస్వామి సమితి సభ్యుల సహకారంతో నిత్యాన్నదానం ఏర్పాటుచేశారు. ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కోరాడ శ్రీనివాసరావు, ఈవో యాళ్ల సూర్యనారాయణ, ట్రస్ట్‌బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

ఆలయంలో జ్వాలా తోరణం

క్షీరారామరామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం వెలిగించారు. ఆదివారం రాత్రి కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని కృత్తికా నక్షత్రం కావడంతో కార్తికేయుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా క్షీరారామలింగేశ్వరస్వామి సన్నిధిలో జ్వాల వెలిగించి ఆలయంలో ప్రదక్షిణలు చేసి ఆలయ సింహ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన జ్వాలా తోరణం వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్వాలా తోరణం కార్యక్రమాన్ని తిలకించారు.

కార్తీక పౌర్ణమి పూజలు

భీమవరం (ప్రకాశం చౌక్‌): భీమవరం పంచారామ క్షేత్రానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీ ఉమా సోమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలో స్వామికి అభిషేకాలు, కార్తీక దీపారాధనలు చేశారు. ప్రత్యేక రుద్రాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక అలంకరణలు నిర్వహించి పూజలు చేశారు. ఆదివారం రాత్రి దేవస్థానంలో కార్తీక దీపాలతో దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో డి.రామకృష్ణంరాజు, ధర్మకర్తలు అర్చకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీరాంపురంలో వేంచేసిన జగన్మాత శ్రీ కనకదుర్గ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి దీపారాధన పూజలు నిర్వహించారు. దేవస్థానం లోపల బయట కార్తిక దీపాలతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి పూజ నిర్వహించి ఆరాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు.

1/3

ప్రత్యేక అలంకరణలో శ్రీ ఉమా సోమేశ్వర స్వామి
2/3

ప్రత్యేక అలంకరణలో శ్రీ ఉమా సోమేశ్వర స్వామి

స్వామి దర్శనానికి తరలివచ్చిన భక్తులు
3/3

స్వామి దర్శనానికి తరలివచ్చిన భక్తులు

Advertisement
Advertisement