పీఎఫ్‌ఐపై కొరడా..!

Sakshi Editorial On Popular Front Of India

గత కొన్నేళ్లుగా ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)ను నిషేధించడానికి కేంద్రం సిద్ధపడినట్టు కనబడుతోంది. ఆ సంస్థ కార్యాలయాలపై, నేతల ఇళ్లపై దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), ఈడీ గురువారం ఏకకాలంలో దాడులు చేశాయి. మొత్తంగా 15 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ సోదాలు చోటు చేసుకున్నాయి. 93 చోట్ల సాగిన దాడుల్లో మొత్తం 109 మందిని అదుపులోకి తీసుకోవటంతోపాటు కీలకమైన పత్రాలు, నగదు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని ఆ విభాగాలు అంటున్నాయి.

దాడులను నిరసిస్తూ పీఎఫ్‌ఐ కార్యకర్తలు కేరళ, కర్ణాటకల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు, ఉగ్రవాదం ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు విభాగాలు రంగంలోకి దిగడం సర్వసాధారణమే. అయితే పీఎఫ్‌ఐ ఇతర ఉగ్రవాద సంస్థల మాదిరి రహస్య కార్యకలాపాలు సాగించటం లేదు. సోషలిస్టు డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌డీపీఐ) అనే పార్టీకి అనుబంధంగా ఉంటోంది. అలాగని ఆ సంస్థపై వచ్చిన ఆరోపణలు సాధారణమైనవి కాదు.

2011లో మహమ్మద్‌ ప్రవక్తపై కేరళలోని ఒక ప్రొఫెసర్‌ ప్రశ్నపత్రంలో అనుచితమైన ప్రశ్న ఇచ్చాడని ఆరోపిస్తూ పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఆయన చేయి నరికారు. కేరళలో ఒక హత్య కేసులో పీఎఫ్‌ఐ కార్యకర్తలకు యావజ్జీవ శిక్ష పడింది. మొత్తం 30 హత్యల్లో పీఎఫ్‌ఐ ప్రమేయం ఉన్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కర్ణాటకలో ఆరెస్సెస్‌ కార్యకర్తనూ, బజరంగ్‌దళ్‌ కార్య కర్తనూ 2016లో హతమార్చిన కేసుల్లోనూ, 2019లో తమిళనాడులో ఒకరిని హత్యచేసిన ఉదంతం లోనూ పీఎఫ్‌ఐ కార్యకర్తలు అరెస్టయ్యారు.

బలవంతపు మత మార్పిడికి ప్రయత్నించినట్టు కేరళలో 2016లో కేసు నమోదైనా తగిన సాక్ష్యాధారాలు లభించలేదు. కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో పని చేసే మూడు సంస్థలు విలీనమై 2007లో పీఎఫ్‌ఐగా ఏర్పడగా అదెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయ లేదు. ఆ సంస్థనుంచే మరో రెండేళ్లకు రాజకీయ పక్షం ఎస్‌డీపీఐ ఆవిర్భవించింది. ముస్లింలు, దళి తులు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు ఆ రెండు సంస్థలూ ప్రకటిం చుకున్నాయి. కర్ణాటకలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై మాత్రమే కాదు, గతంలో కాంగ్రెస్, జేడీఎస్‌ల పాలన సాగినప్పుడు కూడా వాటి విధానాలపై పోరాడిన చరిత్ర పీఎఫ్‌ఐకి ఉంది. అయినా పీఎఫ్‌ఐతో అంటకాగుతున్నట్టు ఆ మూడు పక్షాలూ పరస్పరం ఆరోపించుకుంటూ ఉంటాయి.

ఏ పార్టీ అయినా, సిద్ధాంతమైనా అప్పుడున్న దేశకాల పరిస్థితుల్లో, అప్పడు తలెత్తిన సమస్య లకు జవాబుగా తెరమీదికొస్తాయి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత, అనంతర హింసాకాండ, ముస్లిం మైనారిటీల్లో ఏర్పడిన అభద్రతా భావన పర్యవసానంగా పీఎఫ్‌ఐ వచ్చింది. 2001లో సిమి నిషేధం తర్వాత పీఎఫ్‌ఐగా ఆ సంస్థకు చెందినవారు సమీకృతులయ్యారని కేరళ ప్రభుత్వం 2012లో ఆరోపించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింస, ప్రతిహింసలకు తావులేదు. సమాజంలో ఒక సమూహానికి అన్యాయం జరుగుతున్నదని భావించినప్పుడు దానిపై చట్టబద్ధ విధానాల్లో పోరా డాలి తప్ప ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, అరాచకం సృష్టించే ప్రయత్నం చేయకూడదు.

పీఎఫ్‌ఐపై మొదటి నుంచీ ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2010లోనే పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై నిఘా మొదలైంది. అస్సాం, మణిపూర్‌వంటి ఈశాన్య రాష్ట్రాలతోసహా మొత్తం 22 రాష్ట్రాల్లో ఆ సంస్థ కార్యాలయాలున్నాయి. ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. ఈ స్థాయిలో సంస్థ విస్తరించినా కేరళ, కర్ణాటకల్లో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తప్ప ఇతరచోట్ల గణనీయ మైన బలం లేదు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, ఉడిపి ప్రాంతాల్లో పీఎఫ్‌ఐ మద్దతుతో 2018 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్‌డీపీఐకి 121 స్థానాలు వచ్చాయి. ఉడిపి జిల్లాలో మూడు పురపాలక సంస్థలు ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి.

2013లో మైసూర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచినా 2018 నాటికి అది మూడో స్థానంలోకి పోయింది. ఇతరచోట్ల అత్యంత స్వల్ప శాతం ఓట్లు వచ్చాయి. ఈ ధోరణి ఏం చెబుతోంది? అణ గారిన వర్గాలు, మైనారిటీల కోసం పోరాడుతున్నట్టు పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ చెప్పుకుంటున్నా ఆ వర్గాల నుంచి పెద్దగా మద్దతు లభించడంలేదు సరిగదా అది క్రమేణా తగ్గుతున్నదని రుజువవుతోంది. 

ఎన్‌ఐఏ, ఈడీల ఆరోపణలు సరికాదని పీఎఫ్‌ఐ అంటున్నది. సంఘ్‌ పరివార్‌ను సంతోష పెట్టడానికే తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. అందులో నిజానిజాల సంగతెలా ఉన్నా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇతర పార్టీల, ప్రజాస్వామిక సంస్థల మద్దతు తమకెందుకు లభించడంలేదో పీఎఫ్‌ఐ సమీక్షించుకోవాలి. ఇదే పీఎఫ్‌ఐతో సంబంధాలు న్నాయన్న ఆరోపణతో కేరళకు చెందిన పాత్రికేయుడు సిద్దిఖీ కప్పన్‌ను రెండేళ్లక్రితం యూపీ సర్కారు అరెస్టు చేసినప్పుడు అది అక్రమమని దాదాపు అన్ని పక్షాలూ ఖండించాయి. ఆయనకు ఈమధ్య బెయిల్‌ లభించింది.

నిషేధం ఒక్కటే అన్నిటికీ పరిష్కారం కాదనీ, అది అప్రజాస్వా మికమనీ కేంద్రం కూడా గుర్తించాలి. నేరాలకు పాల్పడే సంస్థలన్నిటిపైనా కఠినంగా వ్యవహరిస్తూనే వాటి తీరుతెన్నులను బట్టబయలు చేయాలి. పీఎఫ్‌ఐకి ప్రజానీకంలో పెద్దగా మద్దతు లేదని తెలుస్తూనే ఉంది. అటువంటి సంస్థను నిషేధిస్తే ప్రజల్లో ఎంతోకొంత సానుభూతి రావడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదని గుర్తించాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top