మస్క్‌ పంజరంలో మాటల పిట్ట!

Sakshi Editorial on Elon Musk Twitter Takeover

తోక లేని తుర్రుపిట్టకు కొత్త రెక్కలొస్తాయా? ఉన్న రెక్కలు తెగిపోతాయా? సుప్రసిద్ధ అంతర్జాతీయ సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ను అంతర్జాతీయ వ్యాపారి ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేశారన్న దగ్గర నుంచి అంతటా ఇదే చర్చ. విద్యుత్‌ కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ ఎక్స్‌ల అధిపతి అయిన మస్క్‌ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు. పరిమితులు లేని భావప్రకటన స్వేచ్ఛ గురించి అదే పనిగా తెగ మాట్లాడుతున్నవాడు. 4400 కోట్ల డాలర్ల (రూ.3.30లక్షల కోట్ల)కు, అంటే ప్రతి షేరూ దాదాపు 54.2 డాలర్లతో ట్విట్టర్‌ను కొంటున్న మస్క్‌ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ సాంకేతిక రంగంలోకెల్లా మూడో అతి పెద్ద కొనుగోలు లావాదేవీ ఇదే. 

ట్విట్టర్‌లో 9.2 శాతం వాటా కొన్నట్టు రెండు వారాల క్రితం బయటపెట్టిన మస్క్‌ తాజా ఒప్పందంతో సంచలనం రేపారు. పదహారేళ్ళ క్రితం మైక్రో బ్లాగింగ్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌గా అమెరికాలో ఏర్పాటైన ట్విట్టర్‌ ఇప్పుడు 130 కోట్లకు పైగా ఖాతాలతో దానికదే ఓ పెద్ద వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు వాడుతున్న మొబైల్‌ యాప్‌లలో 6వది ఈ మాటల పుట్టే. 140 పదాల్లోనే భావావేశాలను వ్యక్తీకరించే ఈ వేదిక వినియోగం మన దేశంతో పాటు జపాన్, జర్మనీ, ఉత్తర అమెరికాల్లో ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 19.2 కోట్ల మంది దీన్ని వినియోగిస్తారని ఓ లెక్క. సోషల్‌మీడియా వేదికగా కొన్నాళ్ళుగా అనేక వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రత్యామ్నాయ సమాచార, భావప్రకటన వేదికగా అపరిమిత ప్రభావం చూపిన ఘనత ఈ టీనేజ్‌ యాప్‌దే! 

రాగల కొద్ది నెలల్లో మస్క్‌ కొనుగోలు తతంగమంతా ముగిశాక, ఇప్పటి దాకా సంస్థను నడిపిన బోర్డు రద్దవుతుంది. పబ్లిక్‌ లిస్టెడ్‌ కంపెనీ కాస్తా ప్రైవేటుదవుతుంది. మాటల పిట్టను మస్క్‌ తన ఇంటి చావిట పంజరంలో పెట్టుకున్నట్టవుతుంది. అయితే, మస్క్‌ సైతం ప్రజాస్వామ్యానికి ‘భావప్రకటన స్వేచ్ఛ’ పునాది అనే చెబుతున్నారు. జనంలో నమ్మకం పెంచడానికి వీలుగా ట్వీట్ల అల్గారిథమ్‌ను ఓపెన్‌ సోర్స్‌ చేయాలనుకుంటున్నాం అంటున్నారు. పెద్ద సంఖ్యలో తనంతట తానే పోస్టులు పంపే ఇంటర్నెట్‌ ప్రోగ్రామైన ‘స్పామ్‌ బోట్‌’లకు సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట వేస్తామన్నారు. అన్నిటికన్నా ముందుగా ట్వీట్లను మార్చుకొని, సరిదిద్దుకొనే వీలూ కల్పించడానికి సమకట్టారు. ఆయన వ్యాపార సామ్రాజ్య ప్రయోజనాలకు భంగం కలగనంత వరకు ఇలాంటి మార్పుల్లో ఏవైనా కార్యరూపం ధరించనూ వచ్చు. తీరా వాటికే దెబ్బ తగిలే పరిస్థితి వస్తే, ఇంత లావు మాటలకూ కట్టుబడడం అంతటి వ్యాపారవేత్తకు సాధ్యమేనా అన్నదే నిపుణుల అనుమానం. పైపెచ్చు, ఇన్ని కబుర్లు చెబుతున్న ఈ పెద్ద మనిషి కొన్నేళ్ళుగా తన వ్యాపార ప్రచారానికీ, విమర్శకులను బ్లాక్‌ చేసి వేధించడానికీ ఇదే ట్విట్టర్‌ను వాడుకున్నారనీ ఆరోపణలున్నాయి. 

ఆ మాటకొస్తే, ఇటీవల కొన్నేళ్ళుగా ట్విట్టర్‌ ఆరోగ్యకరమైన సంభాషణలకు మించి విద్వేష వ్యాఖ్యలకూ, హింసా ప్రేరేపణకూ వేదికగా నిలుస్తున్న సందర్భాలూ కొల్లలు. సమస్యాత్మకమైన దంటూ ముద్ర వేయడంలోనూ ట్విట్టర్‌ ఓ నిలకడ పాటించకపోవడమూ చూశాం. రాజకీయ భావజాలాన్ని బట్టి ‘భావప్రకటన స్వేచ్ఛ’ ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా మారిపోతున్న వర్తమాన పరిస్థితుల్లో ఇక మస్క్‌ వేసే ప్రతి అడుగూ ఆసక్తికరమే! 8 కోట్ల మంది ఫాలోయర్లున్న ట్విట్టర్‌ ఖాతాదారుగా కాక, ఆ సంస్థకే పూర్తి యజమానిగా ఆయన అంతే స్వేచ్ఛను ఇస్తారా? వ్యాపారంలో పెట్టిన డబ్బులకు లాభాలు రాబట్టుకోవడమే పెట్టుబడిదారు ధ్యేయం. మన ఊరి ఎల్లయ్య అయినా, మరో దేశపు మస్క్‌ అయినా అదే కథ. వ్యాపార ప్రయోజనాలున్నవారు ఎంత గొప్పగా మాటలు చెప్పినా, హక్కుల కోసం నిలబడతారనీ, కలబడతారనీ అనుకోవడం వట్టి ఆదర్శమే. ట్విట్టర్‌ను కొన్న ఎలాన్‌ మస్క్‌ను సైతం దీనికి భిన్నంగా ఊహించలేకపోతున్నది అందుకే. ప్రస్తుత సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ సైతం భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని తోటి ఉద్యోగుల అనడం, భవిష్యత్తులో ఈ వేదిక ఏ దిశగా పయనిస్తుందో తనకే తెలియదని వ్యాఖ్యానించడం గమనార్హం. 

కలలు నిజం చేసుకోవడానికి ఎన్నో ఏళ్ళు కష్టపడి, చెప్పిన గడువుకు సరుకులు పంపడం కోసం ఫ్యాక్టరీ నేల మీద పడుకొని, టెస్లాను సక్సెస్‌ చేసి, అనేకసార్లు దివాళా తీసే పరిస్థితి వెళ్ళినా ఇవాళ ప్రపంచ కుబేరుడిగా అవతరించిన మస్క్‌ సామర్థ్యాన్ని శంకించలేం. కాకపోతే, ఒకటే చింత. ఆశయాలే ఊపిరిగా సాగిన జాతీయోద్యమ కాలం నుంచి సాంప్రదాయిక మీడియాలో సింహ భాగానిది స్వతంత్ర ప్రతిపత్తి. కారణాలు ఏమైనా, కాలగతిలో ప్రైవేటు, పెట్టుబడిదారీ అనుకూల వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోతూ వచ్చింది. అలాంటి సందర్భంలో పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆసరాగా సోషల్‌ మీడియా ప్రత్యామ్నాయంగా ఆశలు రేపింది. 

కొన్ని సందర్భాల్లో దుష్ప్రచారంతో దుర్వినియోగం అవుతున్నా, నాణేనికి రెండో కోణం చూపడానికీ, వినపడని గొంతులకు వాణిగా మారడానికీ సామాజిక మాధ్యమ వేదికలే ప్రధాన వాహికలైన పరిస్థితీ చూశాం. ఇప్పుడు పెరుగుతున్న పెట్టుబడులు, భారీ కొనుగోళ్ళతో ఫేస్‌బుక్, ట్విట్టర్‌ లాంటి పాపులర్‌ సోషల్‌ మీడియా వేదికలు గుత్తాధిపత్యంలోకి చేరుతున్నాయి. మస్క్‌ చేతిలో ట్విట్టర్‌ పిట్ట ఆ ట్రెండ్‌కు మరో బలమైన సూచిక. రాజ్యాంగబద్ధమైన ‘సముచిత నిర్బంధాల’ విషయంలో భారత ప్రభుత్వంతో, న్యాయవ్యవస్థతో సంఘర్షించిన సాంకేతిక దిగ్గజం ఇకపై ‘ట్విట్టర్‌ 2.0’గా ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top