కరోనా కాలంలో ఎన్నికల నగరా

Bihar Assembly Election In Coronavirus Time - Sakshi

దేశంలో‌ మహమ్మారి స్వైరవిహారం ఇంకా కొనసాగుతుండగానే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం ఖరారైంది. అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, 7 తేదీల్లో మూడు దఫాలుగా జరిగే ఈ ఎన్నికల ఫలితాలు అదే నెల 10న వెలువడతాయి. ఒకపక్క గత అయిదేళ్లుగా అక్కడి ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వ పనితీరుపై ఎవరూ అంత సంతృప్తిగా లేరు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయినవారు, వేర్వేరు రాష్ట్రాలకు వలసపోయి, ఎన్నో కష్టాలుపడి వెనక్కొచ్చిన లక్షలమంది తమను ప్రభుత్వం సరిగా ఆదుకోలేదని విమర్శిస్తున్నారు. ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన సాగు రంగ సంస్కరణలపై రైతాంగంలో సంశయాలున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికలు వచ్చిపడినందుకు సాధారణంగా అయితే పాలక కూటమి ఆందోళన పడాలి. ఈ పరీక్ష నుంచి ఘన విజయం సాధించి గట్టెక్కడం ఎలా అన్న విచికిత్సలో వుండాలి. కానీ ఎన్నికల సర్వేలు తమకే అనుకూలంగా ఉండటం పాలక కూటమికి భరోసానిస్తోంది. 243మంది సభ్యులుండే అసెంబ్లీలో ఎన్‌డీఏ కూటమికి 141 నుంచి 161 స్థానాలు వస్తాయని సీ ఓటర్‌ సర్వే చెబుతోంది. ఆర్జేడీ– కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలోని విపక్ష కూటమి 64 నుంచి 84 లోపు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఆ సర్వే అంచనా. 

ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ గత పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రి పీఠంపై వున్నారు. ఆయనకు మొదటి రెండు దఫాల్లోనూ పాలనాదక్షుడిగా మంచి పేరే వచ్చింది. రాష్ట్రంలో నేరాలను అరికట్టి, అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్న నేతగా గుర్తింపు వచ్చింది. కానీ గత అయిదేళ్ల పాలన అందుకు విరుద్ధం. కరోనాను అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో, వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉపాధి లేమి ఆ రాష్ట్రాన్ని మొదటినుంచి పీడిస్తోంది. కరోనా వచ్చి ఆ సమస్య తీవ్రతను మరింత పెంచింది. లాక్‌డౌన్‌లో రాజస్తాన్‌లోని కోటలో చిక్కుకున్న బిహార్‌ విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికి నితీష్‌ ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. అందుకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు సాకుగా చూపారు.

కానీ బీజేపీ నాయకత్వంలోని యూపీ ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లోవున్న తమవారిని తీసుకొచ్చేందుకు వందల బస్సులు పంపింది. ఈ అంశాల విషయంలో జనం తీవ్ర అసంతృప్తితో వున్నారని సర్వే చెబుతోంది. అయినా వారు కూటమి వైపే మొగ్గు చూçపడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని సర్వే నిర్వా హకులు అంటున్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన ప్రతిపక్షం కొరవడటం, ప్రధాని నరేంద్ర మోదీపై జనంలో విశ్వాసం ఉండటం వల్లే ఎన్‌డీఏ విజయం సాధ్యమవుతోందని చెబుతున్నారు. సీఎం అభ్యర్థిగా నితీష్‌కుమార్‌ వైపు 30.3 శాతం మంది మొగ్గుచూపితే ఇతరులు ఆయన దరిదాపుల్లో కూడా లేరు. అలాగని గతంతో పోలిస్తే నితీష్‌కున్న ప్రజాదరణ తగ్గింది. అయితే నరేంద్రమోదీకి 48.8 శాతం ఆదరణ వుండటం ఎన్‌డీఏకు కలిసొచ్చే అంశం. 

ఇటు అధికార పక్షం, అటు విపక్షం కూడా ఇంతవరకూ సీట్ల సర్దుబాటు చేసుకోలేక సతమత మవుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే సీట్ల పంపకం పూర్తవుతుందని ఎన్‌డీఏ కూటమి అంటున్నా అదంత సులభం కాదు. ముఖ్యంగా 2015 నాటి ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో జట్టు కట్టిన జేడీ(యూ)... ఎల్‌జేపీ వంటి పార్టీలతో కలిసి పోటీచేసిన బీజేపీ మధ్య దాదాపు 51 సీట్ల పంచాయతీ తేలవలసి వుంది. 2017లో కూటమి భాగస్వామ్య పక్షాలతో విభేదించిన జేడీ(యూ), దాన్నుంచి బయటికొచ్చి ప్రత్యర్థి కూటమి ఎన్‌డీఏలో భాగస్వామిగా మారింది. ఆ ఎన్నికల్లో 28 చోట్ల జేడీ (యూ) నెగ్గితే, 23 చోట్ల బీజేపీ నెగ్గింది. ఆ స్థానాలు తమవంటే తమవని ఇద్దరూ పట్టుబడు తున్నారు. పోనీ ఓట్ల శాతం ఆధారంగా నిర్ణయిద్దామన్నా అదంత సులభం కాదు.

రాజకీయంగా బాగా పట్టున్నా,  గత ఎన్నికల్లో అవతలి పార్టీ కంటే కొద్దిగా ఓట్ల శాతం తగ్గినంత మాత్రాన సీటు ఎలా వదులుకోవాలన్న మీమాంస రెండు పార్టీల్లోనూ తలెత్తుతోంది. కనుక కలిసి పోటీచేసిన 2010 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికగా పంపకాలు వుండాలనుకున్నా తాజాగా కూటమిలో చేరిన దళిత నేత జితన్‌ రాం మంజీ నేతృత్వంలోని హిందూస్తానీ ఆవామ్‌ మోర్చా(సెక్యులర్‌), కొత్తగా చేరబోతున్న ఉపేంద్ర కుష్వాహా నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీలకు కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సివస్తుంది. ఇవన్నీ మరో రెండు రోజుల్లో తేలిపోతాయని ఎన్‌డీఏ కూటమి విశ్వాసం. సీట్ల బేరసారాల్లో ఇదివరకుతో పోలిస్తే నితీష్‌ కుమార్‌ బలహీనపడ్డారు. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్ని కల్లో అక్కడున్న 40 స్థానాల్లో జేడీ(యూ), బీజేపీలో చెరో 17 స్థానాలకూ పోటీ చేయగా, కూటమి లోని మరో పక్షం ఎల్‌జేపీకి ఆరు కేటాయించారు. బీజేపీ, ఎల్‌జేపీలు అన్ని స్థానాల్లోనూ నెగ్గగా, జేడీ(యూ) ఒక సీటు కోల్పోయింది.

పైగా నెగ్గినచోట్ల గతంకన్నా దాని ఓట్లు తగ్గాయి. ఇంకా వెనక్కు వెళ్తే 2015లో జేడీ(యూ) 101 స్థానాల్లో పోటీచేసి 71 మాత్రమే గెల్చుకుంది. అంతక్రితం ఎన్నికల్లో అది 115 నెగ్గింది. తాజాగా సీట్ల పంపకాల్లో ఎల్‌జేపీ ఒత్తిడి తట్టుకోవడానికి నితీషే జితన్‌రాంను కూటమివైపు తీసుకొచ్చారు. ఇక ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. పార్టీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో మొదటినుంచీ సన్నిహితంగా వున్న రఘువంశ్‌ ప్రసాద్‌ తన మరణానికి  ముందు ఆర్జేడీకి గుడ్‌బై చెప్పారు. అలాగే జితన్‌ రాం, కుష్వాహాలు కూడా ఆ పార్టీతో చెలిమి వదులుకున్నారు. ఇదే అదనుగా కాంగ్రెస్‌ తనకు 70 స్థానాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తోంది. అయితే అన్ని స్థానాల్లో పోటీచేసే సత్తా దానికుందా అన్నది ప్రశ్నార్థకమే. రాష్ట్ర జనాభాలో 17 శాతంగా వున్న ముస్లింల ఓటును ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమి చేజిక్కించుకోగలదా అన్నది చూడాల్సివుంది. ఏదేమైనా కరోనా తీవ్రత తగ్గని వర్తమానంలో ఎన్నికల ప్రచారం, పోలింగ్‌ నిర్వహణ కత్తి మీద సాము. కరోనా కేసులు పెరిగితే  అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు ఎన్నికల సంఘం ఆ నింద భరించాల్సివస్తుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top