రెండు ఆలయాలకు.. ఒకే ఒక్కడు | - | Sakshi
Sakshi News home page

రెండు ఆలయాలకు.. ఒకే ఒక్కడు

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: దేవదాయ శాఖలో జోడు గుర్రాల సవారీ పరిపాటిగా మారింది. కారణాలేమిటో తెలీదు కానీ రెండు మూడు ఆలయాలకు ఒక్కరినే ఈఓగా నియమిస్తున్నారు. చిన్న చిన్న ఆలయాలకు ఇలా నియమిస్తున్నారంటే పోనీలే అనుకోవచ్చు. కానీ, లక్షల మంది భక్తులు.. రూ.కోట్ల ఆదాయం వస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇదే ఫార్ములా అమలు చేస్తోంది.

ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి, కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాలకు నిత్యం వేలాదిగా భక్తులు వస్తూంటారు. ఈ ఆలయాలకు ఇద్దరు డిప్యూటీ కమిషనర్‌ స్థాయి అధికారులను ఈఓలుగా నియమించాలి. కానీ, రెండు ఆలయాలకు కలిపి నల్లం సూర్యచక్రధరరావుకు బాధ్యతలు అప్పగించారు. భక్తుల నుంచి రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా ఈ రెండు ఆలయాల నిర్వహణ బాధ్యతలను ఒకే ఈఓకు ఎలా అప్పగిస్తారనే ప్రశ్న వస్తోంది. జిల్లాల పునర్విభజన అనంతరం ఎక్కడ పని చేస్తున్న ఈఓలకు అదే జిల్లాలో బాధ్యతలు అప్పగించాలనే నిబంధన కూడా ఉందని అంటున్నారు. పైగా ఈ రెండు ఆలయాలు దగ్గర్లో ఉన్నవి కావు. రెండింటి మధ్య దూరం 100 కిలోమీటర్ల పైనే. అంత దూరం ఉన్న రెండు ఆలయాల బాధ్యతలను ఒకే ఒక్క ఈఓ ఎలా పర్యవేక్షిస్తారనే కనీస ఆలోచన లేకపోవడం విమర్శల పాలవుతోంది. దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ గతంలో అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేశారు. అన్నవరం, వాడపల్లి ఆలయాల విశిష్టత ఆయనకు తెలియంది కాదు. అయినప్పటికీ ఈ రెండు ఆలయాలకు ఒక్కరినే ఈఓగా ఎలా కొనసాగిస్తురనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది.

తలకు మించిన భారం

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన తరువాత వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. శుక్ర, శనివారాల్లో భక్తుల సంఖ్య 70 వేలకు పైనే ఉంటోంది. హుండీ ఆదాయం రోజువారీ ఐదారు లక్షల రూపాయలు, నెలకు రూ.కోటిన్నర పైనే ఉంటోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.6.25 కోట్లతో వకుళమాత శాశ్వత అన్నదాన భవనం నిర్మాణానికి అప్పట్లోనే శంకుస్థాపన చేశారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆలయం ఎదురుగా రూ.2 కోట్లతో కోనేరు నిర్మిస్తున్నారు. వీటితో పాటు రథశాల, శ్రీనివాసం వసతి భవనం సహా పలు అభివృద్ధి పనులు రూ.20 కోట్లతో జరుగుతున్నాయి. రెండుచోట్ల పార్కింగ్‌ స్థలాలు అభివృద్ధి చేస్తున్నారు. ఇన్ని పనుల పర్యవేక్షణే ఇక్కడి ఈఓ చక్రధరరావుకు తలకు మించిన భారంగా ఉండగా.. ఆయనకే అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి బాధ్యతలు కూడా అప్పగించడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న వస్తోంది.

అన్నవరం క్షేత్రానికి నిత్యం 30 వేల నుంచి 40 వేల మంది వరకూ భక్తులు వస్తూంటారు. అదే కార్తిక పౌర్ణమి, ఏకాదశి వంటి పర్వదినాల్లో లక్షకు పైనే వస్తారు. ఏటా 6 లక్షలకు పైగా సత్యనారాయణస్వామి వ్రతాలు జరుగుతూంటాయి. గత ఏడాది ఆదాయం రూ.160 కోట్లు రాగా.. ఈ ఏడాది రూ.170 కోట్లు వస్తుందనే అంచనా ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ స్కీమ్‌ కింద రూ.40 కోట్లతో అన్నదాన భవనంతో పాటు పలు పనులు జరుగుతున్నాయి. శిథిలావస్థకు చేరిన సీతారామస్వామి సత్రం స్థానంలో దేవస్థానం నిధులు రూ.12 కోట్లతో 135 గదుల వసతి బ్లాక్‌ నిర్మాణం జరుగుతోంది. ఇన్ని కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్న ఈ రెండు ఆలయాల బాధ్యతను ఒకే ఈఓకు అప్పగించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు ఆక్షేపిస్తున్నారు. రద్దీ అధికంగా ఉండే శుక్ర, శనివారాల్లో వాడపల్లి, సోమవారం సహా మరో రెండు రోజులు అన్నవరంలో ఆయన విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రెండు ఆలయాల పర్యవేక్షణ ఆయనకు మరింత భారంగా మారుతోంది. పర్యవసానంగా పాలన గాడి తప్పుతోందనే విమర్శలు వస్తున్నాయి.

అన్నవరం.. ఇన్‌చార్జితోనే సరి

కృష్ణా జిల్లా నుంచి బదిలీపై వచ్చిన సూర్యచక్రధరరావు వాడపల్లి ఈఓగా నియమితులై రెండేళ్లవుతోంది. గత నెలలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ్‌నారాయణరెడ్డి వాడపల్లి, అన్నవరం దేవస్థానాల్లో పర్యటించారు. ఆయన వాడపల్లిలో ఉండగానే చక్రధరరావును అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జిగా నియమిస్తున్న విషయం బయటకు వచ్చింది. మంత్రి పర్యటన ముగియగానే చక్రధరరావును గత నెల 13న అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా నియమించారు. అప్పటికే 4 నెలలుగా అన్నవరం ఇన్‌చార్జి ఈఓగా పని చేస్తున్న దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ వి.త్రినాథరావును ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానానికి బదిలీ చేశారు. అప్పుడు, ఇప్పుడు కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానానికి ఇన్‌చార్జి ఈఓతోనే సరిపెట్టడంలో ఆంతర్యమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

అన్నవరం, వాడపల్లి దేవస్థానాలకు ఒక్కరే ఈఓ

రెండు క్షేత్రాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు

పర్యవేక్షణలో ఇబ్బందులు

దూరాభారంతో సతమతం

సర్కారు నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు

Advertisement
 
Advertisement
Advertisement