ఇక్కట్ల సాగరం.. | - | Sakshi
Sakshi News home page

ఇక్కట్ల సాగరం..

Dec 7 2025 8:44 AM | Updated on Dec 7 2025 8:44 AM

ఇక్కట

ఇక్కట్ల సాగరం..

కానరాని పర్యాటక అభివృద్ధి

బీచ్‌లో మౌలిక వసతులు కరవు

సేద తీరేందుకు షెల్టర్లు లేక ఇబ్బంది

సఖినేటిపల్లి: ఎగసిపడే అలలు.. కనువిందు చేసే ఇసుక తిన్నెలు.. మరోపక్క ఆధ్యాత్మిక పరవళ్లు.. ప్రకృతి సోయగం నడుమ సాగర తీరాన ఆ హాయి వర్ణనాతీతం.. అలాంటి చోట పర్యాటక అభివృద్ధి కానరాకుంది.. అంతర్వేది బీచ్‌కు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు, భక్తులు వస్తుంటాయి. ఇక్కడకు జిల్లా నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తాయి. అలాంటి చోట సౌకర్యాల కల్పనకు పర్యాటక శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడకు వేలాదిగా భక్తులు వస్తుంటారు. స్వామివారి కల్యాణోత్సవాల సమయంలో లక్షల్లో భక్తజనం వస్తుంది. ఈ ఆలయానికి అతి సమీపంలో ఈ బీచ్‌ ఉంటోంది. అందుకే ఆధ్యాత్మికంగా, ఆహ్లాదం కోసం ఇక్కడి వచ్చేవారు వేలాదిగా ఉంటారు. ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న అంతర్వేది బీచ్‌పై పర్యాటక శాఖ ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. పర్వదినాల్లో లక్షల్లో, సాధారణ రోజుల్లో వేలల్లో వచ్చే సందర్శకులకు తగ్గట్టు సౌకర్యాలు లేక ఇబ్బంది ఎదురవుతోంది.

గూడు పోయి.. శిథిలాలు మిగిలాయి

అంతర్వేది బీచ్‌లో గతంలో సరుగుడు తోటలకు చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన హట్‌లు అధికారుల ఆలనా పాలన లేక పూర్తిగా కనుమరుగయ్యాయి. తీరానికి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటక శాఖ ద్వారా విడుదలైన నిధులతో 2018లో ఈ పనులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా బీచ్‌లో దాత పెన్మెత్స సత్యనారాయణరాజు ఉచితంగా ఇచ్చిన ఇరవై సెంట్ల స్థలంలో పర్యాటక నిధులతో అప్పట్లో జమ్ముగడ్డి, తాటిపట్టెలతో కూడిన హట్స్‌, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హట్స్‌ చివికిపోయి ఆ ప్రాంతంలో తాటిపట్టెలు, దూలాలు మిగిలాయి.

ఇసుకపైనే కూర్చుని..

కార్తిక మాసం, ఇతర పర్వదినాల్లో బీచ్‌లో సరదాగా గడపడానికి, వెంట తెచ్చుకునే భోజన పదార్థాలు తినడానికి వసతులు లేక పర్యాటకులు పడుతున్న వెతలు వర్ణనాతీతం. బీచ్‌లో పిల్లాపాపలతో సేద తీరేందుకు షెల్టర్లు లేక, తాగడానికి గుక్కెడు నీరు లేక వెనుతిరిగే పరిస్థితి నెలకొంది. ఇసుకపైనే కూర్చొని, అరచేతిలోనే ఆకులు పెట్టుకుని భోజనంచేసే పరిస్థితులు ఉన్నాయి.

కనీసం నీడ లేక..

అంతర్వేది బీచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేవు. పిల్లాపాపలతో వస్తున్న వారు సేద తీరేందుకు నీడ లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా షెల్టర్లు, తాగునీటి వసతి కల్పించాలి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అంతర్వేదికి ప్రాధాన్యం ఉంది. దానిని కాపాడే చర్యలు అవసరం.

–రావి దుర్గ ఆలేంద్రమణి,

జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు,

అంతర్వేది

అద్దె గదులు కష్టమే..

సుదూర ప్రాంతాల నుంచి అంతర్వేదికి వచ్చి ఒకటి, రెండు రోజులు గడుపుదామనుకునే వారికి వసతి గదులు అద్దెకు తీసుకోవడం కష్టమే. దేవస్థానానికి తగిన సంఖ్యలో వసతి గదులు లేకపోవడం, క్షేత్రంలో ప్రైవేట్‌ వసతి గదులు ఆశ్రయించడం ఆర్థికంగా భారంగా మారుతోంది. ప్రైవేటు వ్యక్తులు గది ఒక్కంటికి రోజుకు సాధారణ రోజుల్లో రూ.1,500, పర్వదినాల్లో రూ.2 వేలు డిమాండ్‌ చేస్తుండడం వారికి పెనుభారంగా పరిణమిస్తోంది. పర్యాటక శాఖ ఈ ఇబ్బందులు తీర్చేందుకు తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.

సందర్శనీయ స్థలాలు

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం అనంతరం భక్తులు, పర్యాటకులకు ప్రముఖమైన సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. అశ్వరూడాంబికా, వశిష్ట ఆశ్రమం, సాగర సంగమం, లైట్‌హౌస్‌ సమీపంలో మడ అడవులు ఉన్నాయి. అయితే వీటి సందర్శనకు సరైన సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. బీచ్‌, సాగర సంగమం వద్దకు అనేమంది వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ప్రధానంగా బీచ్‌లో షెల్టర్లు, మౌలిక వసతులు లేక నిరుత్సాహానికి గురవుతున్నారు. ఏటా కార్తిక, మాఘ మాసాల్లో సుమారు 5 లక్షల వరకూ, సాధారణ రోజుల్లో 15 వేల మంది బీచ్‌ను సందర్శిస్తారు.

వెనుతిరుగుతున్న పర్యాటకులు

సుదూర ప్రాంతాల నుంచి ఉత్సాహంగా బీచ్‌కు సందర్శకులు వస్తున్నారు. ఇక్కడి పరిస్థితి చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కొంతమంది అయితే బాబోయ్‌ అంటూ వెనుతిరుగుతున్నారు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు తినేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అంతర్వేది బీచ్‌లో సౌకర్యాలు మెరుగుపర్చితే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది.

–ఉండపల్లి వరలక్ష్మి, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు, కేశవదాసుపాలెం

ఇక్కట్ల సాగరం..1
1/4

ఇక్కట్ల సాగరం..

ఇక్కట్ల సాగరం..2
2/4

ఇక్కట్ల సాగరం..

ఇక్కట్ల సాగరం..3
3/4

ఇక్కట్ల సాగరం..

ఇక్కట్ల సాగరం..4
4/4

ఇక్కట్ల సాగరం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement