అక్రమంగా తరలిస్తున్న డీజిల్ స్వాధీనం
తాళ్లరేవు: పుదుచ్చేరి ప్రాంతం యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 2,700 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలను సీజ్ చేసినట్లు కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జాతీయ రహదారి 216లోని జైభీమ్‌పేట వద్ద నిర్వహించిన తనిఖీల్లో 700 లీటర్ల డీజిల్‌ను తరలిస్తున్న గూడ్స్ ఆటోను సీజ్‌చేసి, కాకినాడకు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఓ వ్యాన్‌లో 2 వేల లీటర్ల డీజిల్‌ను తరలిస్తున్న యానాంకు చెందిన వ్యక్తిపై మరో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వాడవాడల నుంచి వాడపల్లికి..
ఫ అన్ని దారులూ వెంకన్న క్షేత్రానికే..
ఫ భక్తజనంతో పోటెత్తిన కోనసీమ తిరుమల
కొత్తపేట: కోనసీమ తిరుమలగా, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం శనివారం కిటకిటలాడింది. ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వాడవాడల నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే రద్దీ మొదలైంది. శుక్రవారం రాత్రి నుంచే భక్తులు కాలినడకన బయలుదేరారు. అన్ని దారులూ వాడపల్లి క్షేత్రానికే అన్నట్టు ఒకపక్క రావులపాలెం మీదుగా, మరోపక్క ధవళేశ్వరం, విజ్జేశ్వరం బ్యారేజ్‌ల మీదుగా వాహనాలు తరలివచ్చాయి. ఏడు శనివారాలు – ఏడు ప్రదక్షిణల నోము ఆచరిస్తున్న వారితో ఆ క్షేత్రం నిండిపోయింది. గోవింద నామస్మరణ మార్మోగింది. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల బృందం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. పూర్ణాలంకరణలోని స్వామివారిని దర్శించుకుని పులకించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ఏర్పాట్లను ఈఓ చక్రధరరావు పర్యవేక్షించారు. ఏడు ప్రదక్షిణలు చేస్తున్న మాఢ వీధుల్లో భక్తులతో కలసిపోయి వారి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఉచిత వైద్య శిబిరాలు, తలనీలాలు సమర్పించే చోట, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులను చేరుస్తున్న వాహనాల సేవలను, అన్నప్రసాదం తయారు శాలను పరిశీలించారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము పోలీస్ సిబ్బందితో పాటు, ప్రత్యేక ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఎక్కడికక్కడే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా క్రమబద్ధీకరించారు.


