సహకార ఉద్యోగుల ఉద్యమ బాట
8 డిమాండ్ల సాధనకు ఆందోళనలు
అమలాపురం టౌన్: జిల్లాలోని సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐక్య వేదిక పేరిట రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జేఏసీ) ద్వారా శనివారం నుంచి ఈ నెల, వచ్చే జనవరి నెలల్లో చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు తేదీల వారీగా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ అమలాపురంలోని కళా వెంకట్రావు సహకార యూనియన్‌ల సంఘం శనివారం సమావేశమై ఇప్పటికే రూపొందించిన నిరసనల ప్రణాళిక అమలుపై చర్చించింది. దీనికి రాష్ట్ర సహకార ఉద్యోగ సంఘాల యూనియన్ గౌరవాధ్యక్షుడు పి.అజయ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు తోట వెంకట్రాయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై ఆందోళన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఇటీవల సహకార ఉద్యోగుల యూనియన్లు రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలపై ఎన్నో ఆందోళనలు చేపట్టాయని రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామయ్య గుర్తు చేశారు. సహకార ఉద్యోగులకు ఉన్న రెండు రాష్ట్ర యూనియన్లు ఒకే తాటిపైకి వచ్చి జేఏసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యాయన్నారు. జీవో 36ను వెంటనే అమలు చేయాలని, వేతన సవరణ తక్షణమే చేపట్టాలని, గ్రాడ్యూటీ యాక్ట్ ప్రకారం అమలు చేయాలని, సంఘాల లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ విరమణ వయసు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అమలాపురంలోని జిల్లా సహకార కార్యాలయంలో సీఎస్‌ఓ ఎ.రాధాకృష్ణారావుకు అందించారు. సమావేశంలో జిల్లా యూనియన్ అధ్యక్షుడు వై.రామచంద్రరావు, రాష్ట్ర కోశాధికారి పి.సత్యనారాయణ, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శులు కుంపట్ల అయ్యప్పనాయుడు, మట్టపర్తి జయరామ్, జిల్లా ఉపాధ్యక్షుడు మేడిచర్ల రామలింగేశ్వరరావు, జిల్లా కోశాధికారి బొబ్బ సుబ్రహ్మణ్యచౌదరి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
కార్యక్రమాల ప్రణాళిక ఇలా..
సహకార ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం విధులకు హాజరయ్యారు. 8న డీసీసీబీ బ్రాంచ్‌ల వద్ద సహకార ఉద్యోగుల ధర్నాలు, 16న జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా, వినతి పత్రాల సమర్పణ ఉంటుంది. 22న డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతి పత్రాల సమర్పణ, 29న సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా చేస్తారు. జనవరి 5 నుంచి విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించి రోజుకో జిల్లా ఉద్యోగులచే రిలే నిరాహార దీక్షలు ఉంటాయి.


