తక్షణ చర్యలతో అరటికి రక్షణ
ఐ.పోలవరం: మోంథా తుపాను అరటి పంటపై అధికంగా ప్రభావం చూపింది. రైతులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటే పంటను రక్షించుకునే అవకాశముందని జిల్లా ఉద్యానశాఖ అధికారి బి.వి.రమణ తెలిపారు. ఆయన ఏమన్నారంటే...
● అరటి తోటల్లో మురుగునీటి వసతి కల్పించి, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పంట పది గంటలకు మించి ముంపునకు గురయితే అధిక శాతం మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.
● పంట తేరుకోవడానికి లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2–3 సార్లు పిచికారీ చేయాలి, ఎకరానికి అదనంగా 20 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి.
● అరటి తోటలో ఆరుదల వచ్చేలా చూడాలి. ట్రైకోడేర్మా విరిడి జీవ నియంత్రకాన్ని ఎకరానికి 2 కిలోల చొప్పున 100 కిలోల పశువుల ఎరువుతో కాని, వర్మి కంపోస్ట్ కాని కలిపి చల్లుకోవాలి.
● మూడు నెలలు కంటే చిన్న వయసు గల మొక్కలు 4–5 రోజులపాటు 2–3 అడుగుల లోతు నీటిలో మునిగినప్పుడు వేరు వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోయే ప్రమాదముంది. నీరు లాగిన వెంటనే మొక్కలను తీసివేసి, నేల ఆరిన తరువాత తేలికపాటి దుక్కి చేసి, ఎంపిక చేసిన రకానికి సిఫారసు చేసిన దూరంలో 45–45–45 సెం.మీ పొడవు, వెడల్పు, లోతుగల గుంటలు తీసి టిష్యూ కల్చర్ (లేదా) విత్తన శుద్ధి చేసిన తెగుళ్లు లేని సూది పిలకలను మళ్లీ నాటుకోవాలి.
● ఐదారు నెలల వయసు ఉండి గెలలు వేసే దశలో ఉన్న మొక్కలు ఉన్న తోటల్లో ఐదు రోజుల కంటే ఎక్కువగా, 3 అడుగుల నీటి లోతులో ఉన్న మొక్కల వేరు వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోతుంది. ఈ మొక్కలు నీరు ఆరిన తరువాత కూడా బతకడం కష్టం.
● ఐదు రోజుల కంటే తక్కువగా నీటి ముంపుకు గురి అయినప్పుడు వేరు వ్యవస్థ పాక్షికంగా దెబ్బతింటుంది.
● గాలిలో అధిక తేమ కారణంగా తెల్ల చక్కెర కేళి, గ్రాండైన్, వామన కేళి వంటి రకాలలో సిగటోకా ఆకుమచ్చ తెగులు అధికంగా ఆశించడానికి అవకాశం ఉంది. నేలలో అధిక తేమ వలన బ్యాక్టీరియా దుంప కుళ్లు ఆశించవచ్చు.
తీసుకోవలసిన చర్యలు
● సాధ్యమైనంత త్వరగా ముంపు నీటిని మురుగునీటి కాల్వల ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేయాలి. నేల ఆరిన తరువాత అంతర సేద్యం చేసి మొక్క ఒక్కింటికి 100 గ్రా యూరియా, 80 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20–25 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 దఫాలు వేయాలి.
● ఆకులు తడిసే విధంగా ఐదు గ్రాముల పొటాషియం నైట్రేట్ ఒక లీటరు నీటికి చొప్పున తగినంత జిగురు కలిపి వారంరోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేయాలి. సిగటోకా ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రోపికొనజోల్ 1 మి.లీ మందును లీటరు నీటికి కలిపి జిగురుతో పాటు పిచికారీ చేయాలి.
● అరటి దుంపలు కుళ్లిపోకుండా నివారించడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి లేదా బోర్డో మిశ్రమం 1 శాతం దుంప చుట్టూ తడిసే విధంగా పోయాలి.
● దుంపకుళ్లు ఆశించిన మొక్కలను గమనించి, వాటి చుట్టూ 25 గ్రాముల బ్లీచింగ్ పొడి ఒక లీటరు నీటిలో కలిపి మొదలు తడిసేలా పోయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల తర్వాత మళ్లీ పోయాలి. తర్వాత ఈ మొక్కల మొదళ్లలో 50 గ్రాముల సూడోమోనాస్, 250 గ్రాముల వేపపిండితో కలిపి వేయాలి.
● పూర్తిగా గెలలు విడిచిన, 75 శాతం లోపల గెల తయారీకి వచ్చిన దశలో ఉన్న తోటల్లో ముంపునీరు వల్ల వేరు వ్యవస్థ పాక్షికంగా (లేదా) పూర్తిగా దెబ్బతింటుంది. దీనివలన గెల తయారీకి అవసరమైన నీరు, పోషక పదార్థాలు మొక్క తీసుకోలేదు, తద్వారా గెల పూర్తిగా తయారవ్వకుండా, పక్వానికి వచ్చి నష్టం కలుగుతుంది.
● ముంపు నీటిని సాధ్యమైనంత త్వరగా తోట నుంచి బయటకు పంపి భూమి ఆరే విధంగా చేయాలి. ఆకులు, గెలలు బాగా తడిసే విధంగా లీటరు నీటికి ఐదు గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (0:0:52), ఐదు గ్రాముల పొటాషియం నైట్రేట్ (13–0–45) ఎరువులను వెంటనే మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఒక దాని తరువాత మరొకటి పిచికారీ చేసుకోవాలి.
● గెలలను ఎండిన అరటి ఆకులతో కప్పి వుంచి 15 రోజులలో మార్కెట్ చేసుకోవాలి. వెదురు కరత్రో ఊతమిచ్చి మొక్కలు పడిపోకుండా చేసుకోవాలి. నేలలో మొక్క చుట్టూ గాడిలో 100 గ్రాముల యూరియా, 80 గ్రాముల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.
తక్షణ చర్యలతో అరటికి రక్షణ


