ఇక బ్యాంక్ ఖాతాకు నలుగురు నామినీలు
నేటి నుంచి అమలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బ్యాంక్ ఖాతాలు, లాకర్లు ఉన్నవారికి ఇప్పటిక వరకు ఒక్కరినే నామినిగా పేర్కొనే అవకాశం ఉండేది. కానీ ఇకపై నలుగురిని నామినీలుగా ఉంచే వీలుంది. రిజర్వ్‌బ్యాంక్ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన శనివారం నుంచి అమల్లోకి రానుంది. ఈ మార్పుల వల్ల ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో దాదాపు రూ.67వేల కోట్లకు పైగా సొమ్ము నామినీలు లేక వెనక్కి తీసుకోకుండా అలా ఉండిపోయిందంటూ ఇటీవలే రిజర్వ్‌బ్యాంక్ ప్రకటన చేసింది. ఖాతాదారుడు మరణించిన తరువాత ఉన్న ఒక్క నామినీ అందుబాటులో లేకపోవడం, లేదా క్లయిం చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతోంది. దీంతో కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకోవడానికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. బ్యాంక్ పొదుపు ఖాతాలతో పాటు ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్ ఖాతాలకు, లాకర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఒకేసారి నలుగురి నామినేషన్
ఖాతాకు ఒకేసారి నలుగురిని నామినీలుగా చేయవచ్చు. ఎవరికి ఎంత వాటా (శాతం) అన్నది తెలియజేయవచ్చు. జీవిత భాగస్వామికి 50 శాతంతో పాటు మిగిలినది ముగ్గురు పిల్లలు లేదా ఇష్టం వచ్చినవారికి కేటాయించవచ్చు.
ఒకరి తరువాత మరొకరు
నలుగురు నామినీలను వరుస క్రమంలో ఏర్పాటు చేయవచ్చు. మొదటి నామినీ అందుబాటులో లేకపోతే రెండోవారికి అర్హత వస్తుంది. వారు లేకపోతే మూడోవారికి ఇలా వరుసగా అర్హత ఉంటుంది. లాకర్లలో వస్తువులను పంచడం కష్టం కాబట్టి ఒకరు తరువాత ఒకరు అనే పద్ధతిలో మాత్రమే నామినేట్ చేయాలి. నామినీ పేర్లు నమోదు చేసేటప్పుడు వారి మొబైల్ నంబర్‌తో పాటు ఈ మెయిల్ ఐడీ ఉంటే ఇవ్వాలి. దీనివల్ల వారిని అవసరమైనప్పుడు బ్యాంక్ అధికారులు సులభంగా సంప్రదించవచ్చు.
ఉపయోగాలు
డబ్బు ఎవరికి చెందాలన్న విషయంలో పూర్తి స్వేచ్ఛ, స్పష్టత ఉంటుంది. ఖాతాదారుడు మరణానంతరం డబ్బు డ్రా చేయడానికి ఇబ్బంది పడనక్కర్లేదు. వారసత్వ గొడవలు, చట్టపరమైన సమస్యలు తగ్గుతాయి. బ్యాంకుల్లో ఎవరూ పట్టించుకోని డబ్బు మొత్తం గణనీయంగా తగ్గే వీలుంది. ఈ విధానం త్వరలో మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలకు వర్తింపజేస్తారు.
తనిఖీ చేసుకోవాలి
బ్యాంక్ ఖాతాలు, లాకర్ల నామినేషన్ వివరాలు తనిఖీ చేసుకోవాలి. అవసరమైతే కొత్త పద్ధతి ప్రకారం నామినీలను మార్చుకోవాలి. బ్యాంక్‌శాఖకు వెళ్లడం లేదా నెట్, మొబైల్ యాప్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు. వీలునామా లేనివారు తప్పనిసరిగా నామినేషన్ వివరాలు నమోదు చేయడం మంచిది. – చందాల శ్రీ వెంకట ప్రసాద్,
ఎల్‌డీఏం, కాకినాడ జిల్లా
సద్వినియోగం చేసుకోవాలి
ఖాతాదారుడు మరణాంతరం నామినీ విషయంలో చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికి 30 శాతం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులకు నామినీ లు లేరు. ఖాతా ప్రారంభ సమయంలో ఏదో పేరు రాసేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఖాతాదారు డు మరణించిన తరువాత ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ ఖాతాలను పరిశీలన చేసుకుని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. – అద్దంకి శివప్రసాద్,
ఛీప్ మేనేజర్, ఎస్‌బీఐ, గైగోలుపాడు
ఇదీ లెక్క..
జిల్లాలో బ్యాంకులు 39
బ్రాంచ్‌లు 351
ఖాతాలు 36,88, 853
ఇటీవలే ఇన్‌యాక్టివ్‌గా 2,74,488
గుర్తించిన ఖాతాలు
ఇక బ్యాంక్ ఖాతాకు నలుగురు నామినీలు
ఇక బ్యాంక్ ఖాతాకు నలుగురు నామినీలు


