లైంగికదాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
● ప్రశ్నిస్తానన్న పెద్దమనిషి ఏమయ్యారు?
● మాజీ ఎమ్మెల్యే పొన్నాడ
ఐ.పోలవరం: చిన్నారులపై వరుసగా జరుగుతున్న లైంగికదాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ ముమ్మిడివరం కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ విమర్శించారు. ఐ.పోలవరం మండలం బాణాపురంలో లైంగిక దాడి బాధితురాలి కుటుంబ సభ్యులను శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి పొన్నాడ పరామర్శించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ 30వేల మంది హూమన్ ట్రాఫికింగ్‌కు గురయ్యారని ఆరోపణలు చేసిన పెద్దమనిషి, ఈ రోజు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఆయన ఈ విషయంపై ఎందుకు ప్రశ్నించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. గత ఏడాది పిఠాపురంలో టీడీపీ నాయకుడు, వారం రోజుల క్రితం తునిలో టీడీపీ నేతనని బహిరంగంగా చెప్పుకున్న నారాయణరావు చేసిన అఘాయిత్యాలు మరువక ముందే ఇప్పుడు బాణాపురంలో జనసేన నాయకుడు ఇటువంటి దారుణానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందన్నారు. నిరుపేద కుటుంబాలకు అన్ని విధాలా భరోసా ఇచ్చేందుకు పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహిళ అయిన హోంమంత్రి ఈ విషయంపై వెంటనే స్పందించి నిందితుడు ఆచూకీ తెలుసుకుని కుటుంబానికి భరోసా ఇచ్చి న్యాయం చేయాలన్నారు. నిరుపేద కుటుంబమైన ఆ తల్లి ఎవరికీ భయపడకుండా న్యాయం కోసం పోరాడుతూ ముందుకు రావడం అభినందనీయమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ.50 లక్షలు సాయం అందించి మానవత్వాన్ని చాటుకోవాలన్నారు. పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, కాశి బాలముని కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం కఠిన శిక్ష విధిస్తే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. బాబి దురాగతాలకు చాలామంది మహిళలు, బాలికలు బలయ్యారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే బాబి బండారాలు బయట పడతాయన్నారు. ఎంపీపీ మోర్త రాణిమిరియం జ్యోతి, జెడ్పీటీసీ సభ్యుడు ముదునూరి సతీష్‌రాజు, పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు శ్రీనురాజు, సఖిలే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ తరఫున భరోసా
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం మండలం బాణాపురంలో చిన్నారిని ఆసుపత్రిలోనూ, ఆమె కుటుంబాన్ని ఇంటి వద్ద పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎస్‌ఈసీ) సభ్యుడు పితాని బాలకృష్ణ పరామర్శించారు. బాధితురాలిని డిగ్రీ వరకు చదివించే బాధ్యత తీసుకుంటానని వైఎస్సార్ పార్టీ తరఫున హామీ ఇచ్చి కుటుంబాన్ని ఓదార్చారు.


