నిర్కా పరిశోధనా సమావేశాలు ప్రారంభం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరం జాతీయ వాణిజ్య పరిశోధనా సంస్థ (నిర్కా)లో శుక్రవారం పరిశోధనా సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు జరిగే ఈ సమావేశాలను నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పంటల అభివృద్ధి విభాగంలో పరిశోధనలపై చర్చలు విస్తృతంగా జరిగాయి. శాస్త్రవేత్తలు డాక్టర్ కె.సరళ, డాక్టర్ పి.మణివేలు, డా.కె.ప్రభాకర్‌రావు, డా.సి.నంద, డా. కె.గంగాధర, డా.జె.జె.రాజప్ప, డా.పార్థ సాహ తదితరులు తాము జరిపిన ప్రయోగాల ఫలితాలను పరిశోధనా కమిటీకి తెలియజేశారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, కర్ణాటక తేలిక నేలల్లో మంచి దిగుబడి, నాణ్యతను ఇచ్చే ఎఫ్.సి.వి. పొగాకు రకాల కోసం పరిశోధనలు చేస్తున్నట్టు వారు తెలిపారు. బోడు, మల్లె , ఫ్యుజేరియం విల్ట్ తెగుళ్లను తట్టుకొనే జన్యువులను ఎఫ్.సి.వి. పొగాకు పంట రకాలలో ప్రవేశ పెడుతున్నట్లు ప్రధాన శాస్త్రవేత్తలు డా. ఎం.శేషుమాధవ్, డా.కె.సరళ తెలిపారు. తమ ఫలితాలను సభకు ప్రజెంట్ చేశారు. ఉత్తర కోస్తా తేలిక ప్రాంతాల రైతుల కోసం అధిక దిగుబడి నిచ్చే పొగాకు రకాన్ని అభివృద్ధి పరుస్తున్నట్లు డాక్టర్ సరళ తెలిపారు. ఐ.సి.ఏ.ఆర్ – ఐ.ఐ.ఓ.ర్ ఎమెరిటస్ సైంటిస్ట్ డాక్టర్ సుజాత పలు సూచనలను, సలహాలను శాస్త్రవేత్తలకు అందించారు. మొదటి రోజు సమావేశాల్లో బ్రీడింగ్, బయో టెక్నాలజీ విభాగంలో విస్తృత చర్చలు జరిగాయి. ఈ సమావేశాలలో నిర్కా పరిశోధనా కేంద్రాల విభాగాధిపతులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


