
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
● కూలి పనికి వచ్చి అనంత లోకాలకు
● సామాజిక ఆరోగ్య కేంద్ర వద్ద ధర్నా
సామర్లకోట: స్థానిక పిఠాపురం రోడ్డులో విద్యుత్తు వైర్లు మార్పు చేయడానికి వచ్చిన ఒక కాంట్రాక్టు కార్మికుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గణేష్ కాలనీకి చెందిన నులక బేతాలుడు (30) పిఠాపురం రోడ్డులో విద్యుత్తు వైర్లు మార్పు చేసే పనిలో భాగంగా స్తంభం ఎక్కిన సమయంలో 11కెవీ వైర్ల నుంచి విద్యుత్తు రావడంతో ఒకసారిగా కింద పడిపొయాడు. వెంటనే తోటి సిబ్బంది సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బేతాలుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్న వారు కావడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వైస్‌చైర్మన్ ఉబా జాన్‌మోజెస్, సీఐ ఎ కృష్ణ భగవాన్, కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ, రాష్ట్ర మాలమహానాడు నాయకుడు లింగం శివకుమార్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. పిఠాపురం రోడ్డు కాంట్రాక్టరుతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.8.50 లక్షల నష్ట పరిహరం ఇచ్చేలా ఒప్పించారు. ఆస్పత్రి వద్ద భార్య, కుమార్తె రోదన స్థానికుల హృదయాలను కలచి వేసింది. కుమార్తె నాన్న కావాలని ఏడుస్తూ ఉంటే ఆ బాలికను సముదాయించడం స్థానికులకు సాధ్యం కాలేదు. సామర్లకోట–పిఠాపురం రోడ్డు విస్తరణ పనులలో భాగంగా విద్యుత్తు స్తంభాలను వెనుకకు మార్పు చేశారు. మార్పు చేసిన స్తంభాలకు వైర్లు ఏర్పాటు చేయడానికి శుక్రవారం విద్యుత్తు సబ్ స్టేషన్ నుంచి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయినా విద్యుత్తు వైర్లకు కరెంటు సరఫరా కావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాన్ని పోర్టుమార్టమ్‌కు తరలించి కేసు నమోదు చేసి సీఐ ఎ కృష్ణభగవాన్ దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతానికి యువకుడి మృతి