
అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు వైద్య పరీక్షలు
● పాఠశాలకు తగ్గిన విద్యార్థుల హాజరు
● స్కూల్‌ను సందర్శించిన మండల
అఽధికారులు
జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు శుక్రువారం వారి ఇంటి వద్ద వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. గురువారం ఘటన అనంతరం విద్యార్థినులకు చికిత్స చేసి జగ్గంపేట సీహెచ్‌సీ నుంచి, ఒక ప్రయివేట్ ఆసుపత్రి నుంచి వారి ఇళ్లకు పంపారు. స్థానిక వైద్య సిబ్బంది శుక్రువారం వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితి బాగా ఉన్నట్లు మండల అధికారులకు తెలిపారు. పాఠశాలలో పరిస్థితిని జగ్గంపేట మండల పరిషత్ అధికారి చంద్రశేఖర్, మండల విద్యాశాఖాధికారి ఆర్.స్వామి సమీక్షించారు. పాఠశాలలో క్లాస్ రూమ్‌లు, వెంటిలేషన్, తాగునీటి శుభ్రత, డ్రైనేజీ వ్యవస్థను వారు క్షుణంగా పరిశీలించారు. విద్యార్థులతో అధికారులు మాట్లాడారు. పాఠశాలకు శుక్రవారం విద్యార్థుల హాజరు తగ్గిందని పాఠశాల హెచ్.ఎం మారిశెట్టి నాగేశ్వరరావు తెలిపారు.
217మంది విద్యార్థులకు కేవలం
5 తరగతి గదులు
కాండ్రేగులలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలిపి నిర్వహిస్తున్నారు. మొత్తం 217 మంది విద్యార్థులు వున్నారు. వీరిలో 165మంది హైస్కూల్ విద్యార్థులు కాగా 52 మంది ప్రాథమిక పాఠశాలకు చెందినవారు. హైస్కూల్ విద్యార్థులకు 5క్లాస్‌లకు కేవలం మూడే తరగతి గదులు వున్నాయి. రెండు క్లాస్‌లు వరండాలలో నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు రెండు తరగతి గదులు వున్నాయి. వీరిని సర్దుబాటు చేసి విద్యను అందిస్తున్నారు.
–పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించాలి–విద్యార్దులకు జాగ్రత్తలు చెప్పాలి
కాండ్రేగుల పాఠశాలలో గురువారం విద్యార్థుల అస్వస్థతకు గురికావడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వేసవిని మించి ఎండలు కాస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపేందుకు అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేసివుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై మండల అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.