సీఎస్‌ఈకే క్రేజ్‌..! | - | Sakshi
Sakshi News home page

సీఎస్‌ఈకే క్రేజ్‌..!

Jul 18 2025 5:18 AM | Updated on Jul 18 2025 5:18 AM

సీఎస్

సీఎస్‌ఈకే క్రేజ్‌..!

కొత్త కోర్సులు

ఇంజినీరింగ్‌లో ప్రస్తుతం కొత్త కోర్సులు పరిచయం అయ్యాయి. సీఎస్‌ఈలో ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, ఆడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, ఏరోస్పేస్‌, అగ్రికల్చర్‌, మైరెన్‌, మైనింగ్‌, స్కిల్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ వంటి కొత్త బ్రాంచ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థులు

సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్‌ ఆప్షన్ల నమోదులో తలమునకలవుతున్నారు. ఏపీఈఏపీసెట్‌–2025 వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు జరగనుంది. 22వ తేదీన సీట్ల అలాట్‌మెంట్‌ 23వ తేదీ కళాశాలలో చేరిక, వచ్చే నెల 4వ తేదీన క్లాసులు ప్రారంభం కానున్నాయి. సెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సీఎస్‌ఈ గ్రూప్‌నకే తమ వెబ్‌ ఆప్షన్లలో తొలి ప్రాధాన్యం ఇచ్చారు. రెండవ ప్రాధాన్యంగా ఈసీఈ, ఏఐ కోర్సును ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులకు ఆదరణ తగ్గిపోయింది. కనీసం ఈ బ్రాంచ్‌లను పది శాతం మంది కూడా ఎంచుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ఈ నెల 19వ తేదీన జరిగే వెబ్‌ ఆప్షన్ల మార్పుల్లో సైతం ఇదే పంథా కొనసాగనుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లలో కన్వీనర్‌ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీటు పక్కాగా లభించే అవకాశం ఉంది.

యథేచ్ఛగా దోపిడీ

సీఎస్‌ఈకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు దోపిడీకి తెర తీశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌, డీమ్డ్‌, అటానమస్‌ ఇలా అన్ని ప్రైవేటు కళాశాలల్లో సీఎస్‌ఈ కన్వీనర్‌ కోటా సీట్లు తప్ప మేనేజ్‌మెంట్‌, పేమెంట్‌ సీట్లను పూర్తి స్థాయిలో ఇప్పటికే విక్రయించేశారు. ఏఐసీటీఈ గతేడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్‌ ఎత్తివేయడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలలో డిమాండ్‌ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి. కళాశాల స్థాయి, పేరు ఆధారంగా ఒక్కో కోర్సుకు ఏడాదికి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నట్లు సమాచారం. అదేమని ప్రశ్నిస్తే సీటు ఇవ్వడమే గగనం.. తిరిగి ప్రశ్నిస్తారా? అంటూ ఎదురుదాడికి దిగుతున్నట్లు తెలిసింది. ఏదైనా మాట్లాడితే సీటు ఇవ్వకుండా తిరస్కరిస్తారేమోనన్న భయంతో తల్లిదండ్రులు అడిగినంత ఫీజు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కళాశాలల యాజమాన్యాల నుంచి మామూళ్లు దండుకుని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కన్వీనర్‌ కోటాకే పథకాల వర్తింపు

కోర్సుల ఎంపికలో తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కన్వీనర్‌ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటున్నారు. అన్ని బ్రాంచులు ముఖ్యమైనవేనని, విద్యార్థుల అభీష్టం మేరకు కోర్సుల్లో చేరాలంటున్నారు.

సీఎస్‌ఈ అంటున్నారు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 34 ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. అందులో ప్రభుత్వ 2, ప్రైవేటు 32 ఉన్నాయి. 15,222 మంది సెట్‌లో అర్హత సాధించారు. 17,250 ఇంజినీరింగ్‌ సీట్లు ఉన్నాయి. వీటిలో 75 శాతానికి పైగా సీఎస్‌ఈనే ఎంచుకునే పరిస్థితి ఉందని విద్యా నిపుణులు అంటున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండటంతో సీఎస్‌ఈ గ్రూప్‌నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా సీఎస్‌ఈ జనరల్‌, ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ టెక్నాలజీ వంటి కోర్సుల హవా కొనసాగుతోంది.

కళాశాలల దోపిడీని అరికట్టాలి

ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీలో ప్రైవేటు కళాశాలలు దోపిడీ బహిరంగంగా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా వర్శిటీ అధికారులు, ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేటు కళాశాలలకు సీట్ల కేటాయింపు విచ్ఛలవిడిగా పెంచడంతో ఇదే అదునుగా భావిస్తున్న కళాశాలలు.. విద్యార్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నాయి. డబ్బుల వసూలు చేస్తున్న స్థాయిలో విద్యలో నాణ్యత ఉండటం లేదు.

– ఎంవీ బ్రహ్మానందరెడ్డి, ఏపీటీపీఐఈఏ రాష్ట్ర అధ్యక్షుడు

సంప్రదాయ బ్రాంచ్‌లకు భవిష్యత్తు

సంప్రదాయ బ్రాంచ్‌లకు మంచి భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో ఈ రంగంలో నిపుణుల అవసరం ఉంది. దేశ నిర్మాణంలో వీరి భాగస్వామ్యం చాలా అవసరం. ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌ గ్రూప్‌ ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కానీ వీరిలో 12 శాతం మందికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. మిగిలిన కోర్సుల్లోనూ ఉత్తమంగా రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.

– డాక్టర్‌ కె.బాలాజీ, ప్రిన్సిపాల్‌, వీఎస్‌ఎం

కళాశాల (ఇంజినీరింగ్‌), రామచంద్రపురం

సీఎస్‌ఈకే క్రేజ్‌..!1
1/2

సీఎస్‌ఈకే క్రేజ్‌..!

సీఎస్‌ఈకే క్రేజ్‌..!2
2/2

సీఎస్‌ఈకే క్రేజ్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement