పై చదువులకు పగ్గాలు! | - | Sakshi
Sakshi News home page

పై చదువులకు పగ్గాలు!

Jul 18 2025 5:18 AM | Updated on Jul 18 2025 5:18 AM

పై చదువులకు పగ్గాలు!

పై చదువులకు పగ్గాలు!

డిగ్రీ ప్రవేశాలకు

విడుదల కాని నోటిఫికేషన్‌

రెండు నెలలుగా విద్యార్థుల నిరీక్షణ

జాప్యమైతే ఇతర కోర్సులకు

తరలిపోయే అవకాశం

ప్రవేశాలు తగ్గితే డిగ్రీ

కళాశాలల ఉనికికే ముప్పు

రాయవరం: డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి ఉన్నత విద్యామండలి మీనమేషాలు లెక్కిస్తోంది. ఇంటర్మీడియెట్‌ ఫలితాలు వచ్చి రెండు నెలలైనా డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ రాకపోవడంతో విద్యార్థులలో అయోమయం నెలకొంది. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరికకు కౌన్సెలింగ్‌ కూడా ప్రారంభించారు. అయినా డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌ జాడ లేదు. అయినప్పటికీ అడ్మిషన్ల కోసం విద్యార్థులు కళాశాలలకు వెళ్లి సీట్లు, కోర్సులపై ఆరా తీస్తున్నారు. దీంతో కళాశాలల సిబ్బంది విద్యార్థుల పేర్లు, ఫోన్‌ నంబర్లు నమోదు చేసుకుని నోటిఫికేషన్‌ వచ్చాక కబురు చేస్తామని తిప్పి పంపుతున్నారు.

క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ

50 కంటే తక్కువ అడ్మిషన్లు నమోదైన కళాశాలల్లో వాస్తవ పరిస్థితుల పరిశీలనకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కమిటీలను నియమిస్తోంది. రెండేళ్లుగా 25 శాతం కంటే తక్కువగా అడ్మిషన్లు ఉన్న కళాశాలలను క్షేత్రస్థాయిలో కమిటీ పరిశీలించి అడ్మిషన్లు తక్కువగా ఉండడానికి గల కారణాలపై ఆరా తీసి నివేదిక సమర్పించింది. ఆదికవి నన్నయ యూనివర్శిటీ పరిధిలోని 60 కళాశాలల్లో 25 శాతం కన్నా తక్కువగా అడ్మిషన్లు నమోదైనట్లుగా గుర్తించారు.

జాప్యమైతే కళాశాలలకు ఇబ్బందే

2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది నిర్ణీత సమయంలో డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని భావించినా నోటిఫికేషన్‌ విడుదల కాక విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఈ జాప్యంతో విద్యార్థులు ఇతర కోర్సులు వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. దానివల్ల డిగ్రీ కళాశాలలు సీట్ల భర్తీలో వెనుకబడే అవకాశముంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి నోటిఫికేషన్‌ త్వరగా వెలవరించాలని కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

గతేడాది ఇదే పరిస్థితి

కోవిడ్‌ ప్రభావంతో ఆలస్యమైన డిగ్రీ ప్రవేశాలు అదే ఒరవడిని కొనసాగిస్తూ 2020 నుంచీ అక్టోబర్‌ నెలలో తరగతులు ప్రారంభించారు. కాగా గత ఏడాది ఆగస్టులోనే తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూలైలోనే తరగతులు మొదలవుతాయని ఆశ పడినా నేటి వరకు నోటిఫికేషన్‌ లేకపోవడం గమనార్హం.

నన్నయ పరిధిలో కళాశాలలు ఇవీ..

నన్నయ వర్సిటీ పరిధిలో 171 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఆరు, కాకినాడ జిల్లాలో ఐదు, కోనసీమ జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, కాకినాడ జిల్లాలో రెండు ప్రభుత్వ యాజమాన్యంలో అటానమస్‌ కళాశాలలుండగా, ప్రైవేట్‌ యాజమాన్య పరిధిలో కాకినాడ జిల్లాలో ఒకటి, కోనసీమ జిల్లాలో ఒకటి అటానమస్‌ డిగ్రీ కళాశాలలున్నాయి. ప్రైవేట్‌ యాజమాన్యం పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, కాకినాడ జిల్లాలో రెండు ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 39, కాకినాడ జిల్లాలో 44, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 45 అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలున్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో రెండు, ప్రైవేట్‌ యాజమాన్యంలో నాలుగు, కాకినాడ జిల్లాలో ప్రైవేట్‌ యాజమాన్యంలో ఏడు, కోనసీమ జిల్లాలో ప్రైవేట్‌ యాజమాన్య పరిధిలో నాలుగు మహిళా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. గత విద్యా సంవత్సరంలో అక్నూ పరిధిలో 32 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.

నోటిఫికేషన్‌ విడుదల

కావాల్సి ఉంది

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తాం. ఆన్‌లైన్‌లో అభ్యర్థులు అడ్మిషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముంది. వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ ఎ.మట్టారెడ్డి, డీన్‌ ఆదికవి

నన్నయ యూనివర్శిటీ, రాజానగరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement