
ఒప్పంద అధ్యాపకుల రెన్యువల్‌కు దరఖాస్తుల ఆహ్వానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జోన్ 1, 2 పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులను 2025 – 26 విద్యా సవత్సరానికి రెన్యువల్ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల విద్యాశాఖ ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకుల కార్యాలయం గురువారం ప్రకటనలో తెలిపింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జోన్ 1లో 139, జోన్ 2 లో 178 పోస్టులకు రెన్యువల్ జరుగనుంది. 2024 – 25 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఒప్పంద అధ్యాపకులుగా పనిచేసినవారు మాత్రమే దీనికి అర్హులు. 2025 జూన్ ఒకటో తేదీకి 60 సంవత్సరాలు వయస్సు నిండినవారు దీనికి అనర్హులు. ఈ నెల 18న రెన్యువల్‌పై దినపత్రికల్లో ప్రకటన, 19 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పణ, 21 నుంచి 23వ తేదీ వరకు కౌన్సెలింగ్, 25వ తేదీన అధ్యాపకుల రెన్యువల్ ఉంటుంది.
ప్రధానోపాధ్యాయుల
పాత్ర కీలకం
రాజానగరం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంచడం, వారిలో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించడంలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని వక్తలు అన్నారు. స్కూల్ లీడర్ షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు మండలంలోని మల్లంపూడి సాయిమాధవి ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు రోజులుగా జరుగుతున్న శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ శిక్షణకు ఉమ్మడి జిల్లా నుంచి 174 మంది ప్రధానోపాధ్యాయులు హాజరు కాగా, తొమ్మిది మంది డీఆర్పీలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి గౌరీ శంకరరావు, అనపర్తి ఎంఈఓ సత్తిరెడ్డి, శైలజ పాల్గొన్నారు.
విద్యార్థుల పట్ల వివక్ష
● ఇంగ్లిషులో మాట్లాడటం లేదని వారి
యూనిఫాంకు డిఫాల్టర్ ట్యాగ్
● నిడదవోలు ప్రైవేటు స్కూలులో ఘటన
నిడదవోలు: ఇంగ్లిషులో మాట్లాడని కొందరు విద్యార్థులపై స్కూల్ యాజమాన్యం వివక్ష చూపుతున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో 6, 7 తరగతుల విద్యార్థులు ఇంగ్లిషులో మాట్లాడటం లేదనే పేరుతో వారి యూనిఫామ్‌కు ఓ టీచర్ రెండు రోజులుగా ‘ఇంగ్లిషు డిఫాల్టర్’ అనే పేరుతో కార్డులు తగిలించి, అవమానిస్తున్నారు. దీంతో, ఆయా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈవిధంగా వివక్షకు గురైన ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు బుధవారం చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ టీచర్‌ను స్కూల్ యాజమాన్యం మందలించింది. అయినప్పటికీ ఆమె లెక్క చేయకుండా తిరిగి గురువారం కూడా విద్యార్థుల యూనిఫామ్‌కు ఇంగ్లిష్ డిఫాల్టర్ కార్డులు యూనిఫాంకు తగిలించి, స్కూల్ ఆవరణలో నిలబెట్టి పనిష్మెంట్ పేరుతో ఇబ్బందులకు గురి చేసింది. విషయం తెలుసుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిడదవోలు శాఖ నాయకులు గురువారం స్కూల్ వద్ద ఆందోళన చేశారు. విద్యార్థుల పట్ల ఇలాంటి వివక్షత చూపించడం సరికాదని, పిల్లలెవరైనా మనస్తాపానికి గురై ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇటువంటి స్కూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామని కరస్పాడెంట్ పుష్ప చెప్పారు. విద్యార్థుల యూనిఫామ్‌కు ఇంగ్లిషు డిఫాల్టర్ కార్డులు తగిలించిన టీచర్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఒప్పంద అధ్యాపకుల రెన్యువల్‌కు దరఖాస్తుల ఆహ్వానం