
పెరుగుతున్న వర్జీనియా పొగాకు ధర
● కొనుగోలు దారుల మధ్య పోటీ
● కిలో గరిష్ట ధర రూ.390
● ఇప్పటికి 32,01 మిలియన్ల
కిలోల విక్రయం
దేవరపల్లి: కొనుగోలు దారుల మధ్య పోటీ ఏర్పడడంతో 20 రోజులుగా మార్కెట్లో పొగాకు ధరలు పెరుగుతున్నాయి. జూన్ 24 వరకు కిలో ధర రూ.290 ఉండగా, అనంతరం అంచెలంచెలుగా ధర పెరుగుతూ రూ.390కి చేరుకుంది. దీంతో అధికారులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పొగాకు ఎందుకు పండించామా? అని రైతులు ఒక దశలో దిగాలు పడ్డారు. ఈ వారంలో రోజుకు కిలోకు రూ.10 నుంచి 20 చొప్పున పెరుగుతూ మంగళవారం మార్కెట్లో కిలో రూ.358, బుధవారం రూ.392కి లభించింది. గురువారం మార్కెట్లో రూ.400 పలుకుతుందని రైతులు ఆశించారు. అయితే కిలోకు రూ.2 తగ్గి రూ.390 పలకడంతో రైతులు ఒకింత నిరుత్సాహ పడ్డారు. 20 రోజుల వ్యవధిలో కిలోకు రూ.100 ధర పెరిగింది. గత ఏడాది మార్కెట్లో కొనుగోళ్లు ముగిసే నాటికి కిలో గరిష్ట ధర రూ.410, సగటు ధర రూ.369 లభించింది. ఈ ఏడాది దాదాపు 80 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి కాగా ఇప్పటి వరకు 32.01 మిలియన్ల కిలోలు విక్రయాలు జరిగాయి. ముందు ముందు మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్‌కుమార్ ఇటీవల దేవరపల్లిలో చెప్పడంతో రైతులు మార్కెట్‌పై ఎంతో ఆశతో ఉన్నారు. జూన్ 25కి ముందు అమ్ముకున్న రైతులు కిలోకు రూ.80 నుంచి రూ.100 నష్టపోయారు. అక్టోబరు 15 వరకు ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు జరుగనున్నట్టు అధికారులు చెబుతున్నారు. బుధవారం మార్కెట్‌కు 40 మంది కొనుగోలు దారులు వేలంలో పాల్గొనగా, గురువారం మార్కెట్‌కు 15 మంది హాజరయ్యారు. ధరలు ఈ విధంగా ఉంటే పెట్టుబడులు, కౌలు డబ్బు దక్కుతుందని కౌలుదారులు అంటున్నారు.
రూ.756.15 కోట్ల పొగాకు విక్రయాలు
రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో గురువారం నాటికి రూ.756.15 కోట్ల విలువ గల 31.01 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కొనుగోళ్లు ప్రారంభమై 117 రోజులు కాగా, 93 రోజులు వేలం జరిగింది. 2,50,532 బేళ్లు కొనుగోలు చేశారు. కిలో గరిష్ట ధర రూ.390, కనిష్ట ధర రూ.190, సగటు ధర రూ.177.52 పలికింది. గురువారం 7,156 బేళ్లు అమ్మకానికి రాగా 5,748 బేళ్లు అమ్ముడుపోయాయి.