
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాజమహేంద్రవరానికి అవార్డు
● రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్
● జాతీయ స్థాయిలో 19వ స్థానం
● ఢిల్లీలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ చేతులమీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం సిటీ: పరిశుభ్రమైన నగరాల్లో రాజమహేంద్రవరం రాష్ట్రంలో సెకండ్ ర్యాంక్ సాధించగా జాతీయ స్థాయిలో 19వ స్థానం సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 అవార్డులలో 3–10 లక్షల్లోపు జనాభా కేటగిరీలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అవార్డులు సాధించడంతో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రి మనోహర్‌లాల్ కట్టర్ చేతులమీదుగా కలెక్టర్, నగర పాలక సంస్థ ఇన్‌చార్జ్ కమిషనర్ పి.ప్రశాంతి అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పురస్కారం రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో ఓ కీలక మైలురాయి అని పేర్కొన్నారు. పరిశుభ్రత కోసం తీసుకున్న వినూత్న చర్యలు, స్మార్ట్ టెక్నాలజీ వినియోగం, డోర్ టూ డోర్ చెత్త సేకరణ, రీసైక్లింగ్ విధానం, పారిశుధ్య సిబ్బంది కృషితో పాటు పౌరుల భాగస్వామ్యంతో ఇదంతా సాధ్యపడిందన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 1,12,780 గృహాలు ఉండగా రోజుకి 160 టన్నుల చెత్త బయటకు వస్తుందన్నారు. ఇందులో తడి చెత్తను సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తున్నామన్నారు. దాదాపు 1,400 మందికి పైగా పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా 182 వాహనాల ద్వారా డోర్ టూ డోర్ చెత్త సేకరణ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. గతంలో 54వ ర్యాంకు సాధించిన నగరం మెరుగైన స్థాయిలో నిలిచిందన్నారు.