
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ధర్నా
నిడదవోలు : విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఽనిడదవోలు పట్టణ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో స్థానిక గణపతి జంక్షన్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లపై చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారని తక్షణమే మీటర్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు కోరారు. పలువురు నాయకులు మాట్లాడుతూ టీడీపీ కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఉల్లంఘించాయన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ నెల్లూరులో యువగళం సభలో స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని పిలుపునిచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ కంపెనీకి లాభం చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా మీటర్లు బిగిస్తున్నారని విమర్శించారు. గాదె కృష్ణ, గెడ్డంకుమార్, చంద్ర, మురళి, శ్రీనివాసరావు, సుదాకర్, చంద్రశేఖర్, బాబ్జి, ఖదీర్‌గౌస్, నాని పాల్గొన్నారు.