
ఆగుతూ.. ఊగుతూ..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంతో కలిపి రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు శానిటరీ మెటీరియల్‌తో సహ క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు సెంట్రలైజ్డ్ ఈ ప్రొక్యూర్ రీ టెండర్ ఖరారు మరింత ఆలస్యం కానుంది. వాస్తవానికి ఈ నెల రెండో తేదీన ఈ టెండర్ ఖరారు కావాలి. అయితే వివిధ కారణాలతో ఆ టెండర్ ఖరారు బాధ్యతను దేవదాయ, ధర్మాదాయశాఖ ప్రభుత్వానికి అప్పగించినట్టు సమాచారం. అన్ని దేవస్థానాలకు కలిపి సుమారు రూ.60 కోట్లకు పైబడిన టెండర్ అవడంతో దేవదాయశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు లేదా ఆగస్టులో ఖరారు చేయనున్నట్లు సమాచారం.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ దేవస్థానానికి ఆ దేవస్థానం తరఫున శానిటరీ టెండర్లు పిలిచి ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని దాదాపు పది నెలలు ఆలస్యం చేశారు. ఏడు ప్రముఖ దేవస్థానాలను ఒకే యూనిట్‌గా శానిటరీ టెండర్లు నిర్వహించాలని గత ఏడాది ఆగస్టు 27న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
టెండర్ ప్రక్రియ
తొలిసారిగా ఏప్రిల్‌లో టెండర్ పిలిచారు. అయితే ఆ నోటిఫికేషన్‌పై టెండరుదారులు అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరికొన్ని మార్పులతో కొత్త నోటిఫికేషన్‌ను జూన్ 12న విడుదల చేసింది. టెండరుదారులు తమ కొటేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీగా జూన్ 26ను నిర్ణయించారు. మొత్తం 23 మంది టెండర్ కోసం పోటీ పడినా, వివిధ కారణాలతో 21 మంది పక్కకు తప్పుకున్నారు. జూన్ 30న టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి శానిటరీ ఏజెన్సీస్, తిరుపతికి చెందిన పద్మావతి హౌస్ కీపింగ్, ఫెసిలిటీ సంస్థ క్వాలిఫై అయ్యాయి. దీంతో ఆ రెండు సంస్థల ప్రైస్ బిడ్ జూలై మూడో తేదీన ఓపెన్ చేసి తక్కువ కొటేషన్ దాఖలు చేసిన వారికి టెండర్ ఖరారు చేయాల్సి ఉంది.
సాంకేతిక కారణాలతో వాయిదా
సాంకేతిక కారణాలతో టెండర్ ఖరారును ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వం వివిధ శాఖల అధికారులతో ఒక కమిటీని నియమించిందని, ఆ కమిటీ త్వరలో టెండరు దారును ప్రకటిస్తుందని అధికారులు తెలిపారు. అయితే ఈ టెండర్ పద్మావతి సంస్థకే దక్కినందున విమర్శలు రాకుండా ఉండేందుకే కాలయాపన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఏడు దేవస్థానాలలో శానిటరీ నిర్వహణ
టెండర్ దక్కించుకున్న సంస్థ రెండేళ్ల కాలపరిమితిలో అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాలలో పారిశుధ్య పనులు, వివిధ సత్రాలలో హౌస్ కీపింగ్, రహదారులు, టాయిలెట్స్ క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనులు చేయాలి.
పెరగనున్న వ్యయం!
అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య సేవలకు కేఎల్‌టీసీ సంస్థకు నెలకు రూ.49 లక్షలు ఇచ్చేవారు. కనకదుర్గ ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలతో పాటు మరో రూ.12 లక్షలను మెటీరియల్‌కు కలిపి రూ.71 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి పిలిచిన సెంట్రలైజ్డ్ టెండర్‌లో పారిశుధ్య పనుల్లో అత్యాధునిక మెషినరీ ఉపయోగించాలనే షరతుతో బాటు ఏసీల నిర్వహణ, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఫలితంగా దేవస్థానంలో నెలకు శానిటరీ కాంట్రాక్టు రూ.80 లక్షలకు పైమాటే. అంటే ఏడాదికి సుమారు రూ.పది కోట్లను పారిశుధ్యం కోసమే వెచ్చిస్తారు.
గత టీడీపీ ప్రభుత్వంలోనూ ‘పద్మావతి’దే
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2014–19 మధ్య అన్నవరంతో పాటు పలు దేవస్థానాలలో శానిటరీ టెండర్‌ను పద్మావతి సంస్థ దక్కించుకుంది. మొదట రెండేళ్లు కాలపరిమితికి టెండర్ దక్కించుకున్న ఈ సంస్థకు ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం మరో రెండేళ్లు కాంట్రాక్టు పొడిగించింది. పద్మావతి సంస్థ యజమాని భాస్కర నాయుడు టీడీపీ పెద్దలకు సన్నిహితుడు కావడమే అందుకు కారణం. ఇప్పుడు మరలా ఆ సంస్థకే టెండర్ దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దేవాలయాల శానిటరీ టెండర్ ఖరారు మరింత ఆలస్యం
ప్రభుత్వానికే బాధ్యత అప్పగించిన వైనం
ఏడాదికి రూ.60 కోట్లకు పెరగనున్న టెండర్
పద్మావతి సంస్థకే దక్కినట్టు ఊహాగానాలు
గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఆ సంస్థకే కాంట్రాక్టు
కాంట్రాక్ట్ ముగిసి ఆరు నెలలైనా...
అన్నవరం దేవస్థానంలో శానిటరీ పనులు నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌టీఎస్ సంస్థ కాంట్రాక్టు గత నవంబర్‌తో ముగిసింది. నిబంధనల ప్రకారం ఆ కాంట్రాక్టు ముగియడానికి ఒక నెల ముందుగానే ఈ శానిటరీ టెండర్ ప్రకటన (గత అక్టోబర్‌లో) విడుదల కావాలి. టెండర్లు పిలవడం ఆలస్యం కావడంతో, దేవస్థానం కోరిక మేరకు 2025 ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆ సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. అనంతరం మార్చి ఒకటిన దేవస్థానంలో శానిటరీ పనుల నిర్వహణకు ఎటువంటి టెండరు లేకుండానే గుంటూరుకు చెందిన కనకదుర్గ శానిటరీ సర్వీసెస్‌కు తాత్కాలికంగా అప్పగించారు. కానీ శానిటరీ మెటీరియల్‌ను మాత్రం దేవస్థానమే అందజేస్తోంది. జూలైతో కలిపి ఆ సంస్థ ఐదు నెలలుగా దేవస్థానంలో పారిశుధ్య కాంట్రాక్టు నిర్వహిస్తోంది. ప్రతి నెలా సిబ్బందికి జీతాలు ఆలస్యంగా ఇస్తుండడం వివాదస్పదమవుతోంది. జూలై నెలలో కూడా 15 తేదీ దాటినా ఇంకా పారిశుద్య సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు.

ఆగుతూ.. ఊగుతూ..