అన్నవరంలో శానిటరీ కాంట్రాక్టర్‌ మోసం | - | Sakshi
Sakshi News home page

అన్నవరంలో శానిటరీ కాంట్రాక్టర్‌ మోసం

Jul 17 2025 3:48 AM | Updated on Jul 17 2025 3:48 AM

అన్నవ

అన్నవరంలో శానిటరీ కాంట్రాక్టర్‌ మోసం

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్టర్‌ ఘరానా మోసం బయటపడింది. ఆలయంలో పారిశుధ్య పనులు చేసే సిబ్బందికి ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లిస్తున్నట్టు నకిలీ చలానాలు జమ చేసి, ఏకంగా రూ.1.77 కోట్ల బిల్లు రాయించుకున్నాడు. అయితే మూడు నెలలుగా తమ ఖాతాల్లో పీఎఫ్‌ జమకాక పోవడంతో పారిశుధ్య సిబ్బంది ఆందోళన చేశారు. దీంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్టును విజయవాడకు చెందిన కనకదుర్గ మేన్‌ పవర్‌ సర్వీసెస్‌ సంస్థ నిర్వహిస్తుంది. ఈ సంస్థ ప్రతి నెలా సుమారు 350 మంది సిబ్బందికి రూ.59 లక్షలను వేతనాలుగా చెల్లించాలి. ఈ మొత్తంలో ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కింద 12 శాతం సిబ్బంది, 13 శాతాన్ని దేవస్థానం తరఫున కాంట్రాక్టర్‌ చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా కాంట్రాక్టర్‌ పీఎఫ్‌ డబ్బులు కట్టేస్తే, అతడికి దేవస్థానం చెల్లిస్తుంది.

నకిలీ రశీదులు

దేవస్థానం నుంచి సిబ్బంది పీఎఫ్‌ వాటా సొమ్ముల కోసం కాంట్రాక్టర్‌ మోసానికి తెర తీశాడు. ఆ డబ్బులు చెల్లించినట్టు నకిలీ రశీదులు సృష్టించాడు. వాటిని దేవస్థానానికి జమ చేశాడు. నిబంధనల ప్రకారం.. అతడు డబ్బులు కట్టిన తర్వాతే, దేవస్థానం తిరిగి చెల్లిస్తుంది. మార్చిలో రూ.10,09 లక్షలు, ఏప్రిల్‌లో రూ.10.64 లక్షలు, మేలో 10.45 లక్షలు చెల్లించినట్టు నకిలీ రశీదులు జమ చేశాడు. దీంతో దేవస్థానం ఆ మొత్తాలను కలిపి ఆ మూడు నెలలూ నెలకు రూ.59 లక్షలను పారిశుధ్య సిబ్బంది జీతాలుగా చెల్లించింది. వాస్తవానికి దేవస్థానం అధికారులు, ఆడిట్‌ అధికారులు ఈ చెల్లింపులు కరెక్టేనా అని తనిఖీ చేయాలి. కానీ అవేమీ లేకుండా బిల్లు చెల్లించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మోసం బయటపడిందిలా..

పారిశుధ్య సిబ్బందికి ప్రతి నెలా జీతం పడుతున్నప్పటికీ పీఎఫ్‌ అకౌంట్‌కు జమ కావడం లేదు. దీంతో పారిశుధ్య సిబ్బంది ఆందోళన చేశారు. దీనిపై కాంట్రాక్టర్‌ను దేవస్థానం అధికారులు వివరణ అడగడంతో అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అతనిచ్చిన రశీదులను స్కాన్‌ చేస్తే అవి నకిలీవని తేలింది. కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి కేసు పెడతామని హెచ్చరించడంతో అతను మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి జూలై 9, 14, 15 తేదీలలో రూ.10.09 లక్షలు, రూ.9.90 లక్షలు, రూ.9.75 లక్షలు చెల్లించి ఆ రశీదులను మంగళవారం జమ చేశాడు. కాగా.. కాంట్రాక్టర్‌ ముందుగా ఇచ్చిన రశీదులపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఆ మూడు బిల్లులు డిసెంబర్‌లో కట్టినవిగా తేలింది. వాటిపై నంబర్లు, తేదీని ఫోర్జరీ చేసి దేవస్థానంలో పీఎఫ్‌కి చెల్లించినట్టుగా మార్చారు. అంతే కాకుండా కట్టిన మొత్తం కూడా ఒక్కోటి రూ.5 లక్షలు చొప్పున ఉన్నాయి.

రూ.30 లక్షల పీఎఫ్‌ చెల్లించినట్టు నకిలీ రశీదులు అందజేత

వాటి ఆధారంగా రూ.1.77 కోట్ల బిల్లులు

చెల్లించిన దేవస్థానం అధికారులు

సిబ్బంది ఆందోళనతో వెలుగులోకి..

కాంట్రాక్టర్‌ను సంజాయిషీ కోరాం

శానిటరీ టెండర్‌ దారుడు పీఎఫ్‌ చెల్లించనట్టుగా నకిలీ చలానాలు జమ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. దానిపై విచారణ చేయాలని సంబంధిత సెక్షన్‌ అధికారులను ఆదేశించాం. కాంట్రాక్టర్‌ తప్పు చేసినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

– వీర్ల సుబ్బారావు, ఈఓ,

అన్నవరం దేవస్థానం

అన్నవరంలో శానిటరీ కాంట్రాక్టర్‌ మోసం 1
1/1

అన్నవరంలో శానిటరీ కాంట్రాక్టర్‌ మోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement