
దేశ ప్రగతికి సాంకేతికతే వెన్నెముక
సాక్షిప్రతినిధి, కాకినాడ: దేశం ప్రగతి వైపు పయనించాలంటే సాంకేతిక వెన్నెముకగా ఉండాలని న్యూఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కేకే అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం బీటెక్ విద్య ఏఐతో ముడిపడి నూతన పుంతలు తొక్కుతోందన్నారు. ఏ ఐఐటీలోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు లేదన్నారు. కేవలం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కళాశాలలు మాత్రమే విద్యార్థులను ఎక్కువ చేర్చుకునేందుకు ఐటీ విభాగాన్ని ప్రారంభిస్తున్నాయన్నారు. కాకినాడలో 1946లో ఏర్పాటైన ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల 80వ వడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఓక్ ఉత్సవాలను బుధవారం ఘనంగా ప్రారంభించారు. జేఎన్‌టీయూ కాకినాడ వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అగర్వాల్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకురావాలన్నారు. ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులకు మెరుగైన పద్ధతులలో శిక్షణనివ్వాలని పిలుపు నిచ్చారు. ఓక్ వేడుకలలో భాగంగా ఏడాది పాటు అంతర్జాతీయ కాన్ఫరెన్సులు, వర్క్‌షాప్‌లు, చర్చాగోష్టులు నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసి, క్యాలెండర్‌ను ప్రతినిధులు విడుదల చేశారు.
రాజకీయ జోక్యం ఉండకూడదు
గౌరవ అతిథి ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్ మాట్లాడుతూ గత 50 ఏళ్లలో 47 యూనివర్సిటీను కొలమానంగా తీసుకోగా, వాటిలో మూడు విశ్వవిద్యాలయాలు మాత్రమే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యలో నూతన విధానాన్ని ప్రారంభించేందుకు విద్యార్థులకు అధిక సంఖ్యలో చేర్చుకోవాలన్నారు. రష్యా, చైనా దేశాల మాదిరిగా ప్రగతి సాధించాలంటే సైన్స్ బోధనలో ముందడుగు వేయాలన్నారు. విద్యలో రాజకీయవేత్తల జోక్యం ఉండకూడదన్నారు.
నైపుణ్యాల కొరత
ప్రొఫెసర్ డి.జానకిరామ్ మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా నూతన విద్యా విధానం 2020ను తీసుకువచ్చారన్నారు. దేశంలో ఇంజినీరింగ్ పట్టభద్రులు నైపుణ్యాల కొరతతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. దీన్ని సరిదిద్దడానికి విద్యావేత్తలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ ఎన్‌ఎంకే భట్టా మాట్లాడుతూ విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి కలిగేలా పాఠ్యాంశాలను రూపొందించాలన్నారు. జేఎన్‌టీయూకే వీసీ ప్రసాద్ మాట్లాడుతూ ఏఐఆర్‌ఎఫ్‌లో మెరుగైన ర్యాంకు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ నెల 17, 18 తేదీలలో ‘రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 స్వర్ణాంధ్ర వికసిత్ భారత్’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.శ్రీనివాసరావు, ఓక్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ పి. ఉదయభాస్కర్, వైస్ ఛైర్మన్ ఎస్.శ్రీనివాస కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.పద్మరాజు పాల్గొన్నారు.
సౌత్ ఏషియన్ వర్సిటీ ప్రెసిడెంట్ అగర్వాల్
ఓక్ ఉత్సవాలు ప్రారంభం