
శతాధిక వృద్ధుడి మృతి
గోపాలపురం: వేళ్ల చింతలగూడెం గ్రామానికి చెందిన కొర్లపాటి వెంకట్రావు (101) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుమారుడు కొర్లపాటి శ్రీరామచంద్రరావు వేళ్ల చింతలగూడెం సర్పంచ్‌గా పనిచేశారు. కాగా.. వెంకట్రావు మృతదేహాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సందర్శించి నివాళులర్పించారు.
మోటారు సైకిల్ ఢీకొని..
గండేపల్లి: జాతీయ రహదారిపై మల్లేపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొర్రంపాలేనికి చెందిన శీలం రామకృష్ణ (64), అప్పారావు మోటారు సైకిల్‌పై తాగునీటి కోసం మల్లేపల్లి వస్తున్నారు. ఆ గ్రామంలో సంత మార్కెట్ సమీపంలోకి వచ్చేసరికి వెనక వస్తున్న మరో మోటారు సైకిల్ వీరిని డీకొంది. ఈ ప్రమాదంలో రామకృష్ణ తలకు తీవ్రగాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మోటారు సైకిల్‌పై వస్తున్న వారికి గాయాలు కావడంతో చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాము కాటుకు..
అంబాజీపేట: కొబ్బరి బొండాలు విక్రయించే వ్యక్తి పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇరుసుమండకు చెందిన తోట శ్రీనివాసరావు (58) ముక్కామల గ్రామంలో కొబ్బరి బొండాలు విక్రయిస్తుంటాడు. రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి వ్యాపారం ముగిసిన తర్వాత ఖాళీ కొబ్బరి బొండాలను దూరంగా పారబోయడానికి ఒబ్బిడి చేస్తున్నాడు. ఆ సమయంలో ఖాళీ కొబ్బరి బొండాల్లో ఉన్న రక్త పింజరి కాటు వేయడంతో మృతి చెందాడు. శ్రీనివాసరావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
రైతుపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
నల్లజర్ల: పోతవరం గ్రామానికి చెందిన రైతు కానూరి జనార్దనరావుపై మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటనలో ఆయన కాలుకు తీవ్ర గాయం కావడంతో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జనార్దనరావుకు జంగారెడ్డిగూడేనికి చెందిన కొందరితో భూవివాదాలు ఉన్నాయి. ఆ విషయంపై మంగళవారం తాడేపల్లిగూడెం కోర్టుకు హాజరై అనంతరం పోతవరంలో తన ఇంటికి వచ్చేశాడు. ఆ సమయంలో సుమారు 8 మంది తనపై దాడి చేశారని, కోర్టు కేసు ఉపసంహరించుకోకుంటే చంపేస్తామంటూ బెదిరించారని, కర్రలతో తీవ్రంగా కొట్టారని రైతు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నల్లజర్ల పోలీసులను వివరణ కోరగా.. ఆసుపత్రి నుంచి ఎంఎల్‌సీ రిపోర్టు అందాల్సి ఉందన్నారు.

శతాధిక వృద్ధుడి మృతి