
విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రాధాన్యం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ అన్నారు. వర్సిటీ ఆడిటోరియంలో బుధవారం అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సెక్రటరీలు, కరస్పాండెంట్లతో మీట్ గ్రీట్ విత్ వైస్ చాన్సలర్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ అనుబంధ కళాశాలల్లో నైపుణ్యతా ప్రమాణాలను పెంచడానికి చేపట్టిన వినూత్న ఇన్నోయేటివ్స్‌ను వివరించారు. సిలబస్, రెగ్యులేషన్స్ నవీకరణ, పరిశోధనలకు పెద్దపీట వేయడం, విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి విద్యా సంవత్సరం అకడమిక్ ఆడిట్ నిర్వహించాలని, స్టూడెంట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగాలన్నారు. యూనివర్సిటీలో ఓపెన్ లెర్నింగ్, ఓడీఎల్ కోర్సులు, మూక్స్ విద్యా విధానాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. విదేశీ యూనివర్సిటీలతో ఎంఓయూ ద్వారా బీటెక్, ఎంటెక్ ప్రోగ్రామ్‌లను నిర్వహించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీలో జరుగుతున్న పరిశోధనలు, నూతన సదుపాయాలను వివరించారు. కార్యక్రమంలో రెక్టార్ వీవీ సుబ్బారావు, ఓఎస్‌డీ ప్రొఫెసర్ డి.కోటేశ్వరరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.శ్రీనివాసరావు, అఫిలియేషన్స్, లీగల్ మ్యాటర్స్ డైరక్టర్ ఎ.బాలాజీ, డైరెక్టర్ అకడమిక్స్ ప్రొఫెసర్ ఎంహెచ్‌ఎం.కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జేఎన్‌టీయూకే వీసీ ప్రసాద్
ఉత్సాహంగా మీట్‌గ్రీట్ విత్
వైస్ చాన్సలర్ కార్యక్రమం