
ట్రాక్టర్ డ్రైవర్ మృతి
రాజానగరం: జాతీయ రహదారిపై గైట్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. అతడిని రావులపాలెం మండలం ఈతకోటకు చెందిన పెనుమత్స హరీష్ (32)గా గుర్తించారు. రాజానగరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీష్ తన ట్రాక్టరులో ఎరువుల లోడు చేసుకుని శంఖవరం వెళుతుండగా గైట్ కళాశాల వద్ద ప్రమాదానికి గురయ్యాడు. రహదారి నుంచి కళాశాల ప్రాంగణంలోకి వెళుతున్న కళాశాల బస్సును ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొనడంతో డివైడర్‌పై నుంచి దూసుకుపోయింది. ఈ క్రమంలో కింద పడిన హరీష్‌పై నుంచి ట్రాక్టరు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి బావ ఇసుకపల్లి శివరామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు.