
కుమార్తె కోసం తల్లిడిల్లి..
● గోదావరిలోకి దూకి
మహిళ ఆత్మహత్యా యత్నం
● నాలుగు నెలలుగా కూతురి
ఆచూకీ లేకపోవడంతో మనస్తాపం
● రక్షించిన పట్టణపోలీసులు
తాళ్లపూడి(కొవ్వూరు): తన కుమార్తె నాలుగు నెలలుగా కనిపించడం లేదన్న మనస్తాపంతో కొవ్వూరుకు చెందిన మహిళ గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పట్టణ సీఐ విశ్వం తెలిపిన వివరాల మేరకు దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన చిలకలపూడి నాగమణి రోడ్ కం రైల్వే బ్రిడ్జి పైకి ఎక్కి గోదావరిలోకి దూకినట్టు తెలిపారు. ఆమెను వెంటనే సమీపంలోని మత్స్యకారులు రక్షించారు. అయితే అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సీఐ తెలిపారు. 18 ఏళ్ల ఆమె కుమార్తె 4 నెలలుగా కనిపించడం లేదని మనస్తాపానికి గురైనట్టు ఆయన తెలిపారు. బంధువులు, స్నేహితుల ఇళ్ల దగ్గర అన్నిచోట్లా వెతికినప్పటికీ కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని, ఆమెను రక్షించడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఇతర అధికారులు తీవ్రంగా శ్రమించారని సీఐ తెలిపారు. ఆమెను పట్టణ పోలీసులు, ఆర్డీవో రాణి సుస్మిత, తహసీల్దార్ తదితరులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కుమార్తె కోసం తల్లిడిల్లి..