
గంజాయితో ఉన్న నలుగురి అరెస్టు
4 కేజీల
సరకు స్వాధీనం
పిఠాపురం: ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చి పంచుకుంటున్న ఐదుగురు యువకులను మంగళవారం అరెస్టు చేసి 4 కేజీల సరకును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన కడియపు ప్రేమ్‌కుమార్ మరో బాలుడు కలిసి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన గంజాయి సరఫరాదారు మడ్డు లోకేష్ నుంచి సరకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వీరితో పాటు పిఠాపురం మంగయ్యమ్మరావుపేటకు చెందిన దనాల మనోహర్, కొత్తపల్లి మండలం మూలపేటకు చెందిన రామివెట్టి దుర్గాప్రసాద్ గంజాయి విక్రయిస్తుంటారు. నక్కపల్లి నుంచి గంజాయి తీసుకురాగా గొల్లప్రోలు శివారు ప్రాంతంలో ఒక లే అవుట్ వద్ద ఐదురుగు కలిసి తెచ్చిన గంజాయిని పంచుకున్నారు. దానిలో కొంత తాము వాడుకుని మిగిలిన దానిని ఎక్కువ రేటుకు విక్రయించాలనుకున్నారు. ఈ మేరకు అందిన సమాచారంతో ఎస్సై ఎన్ రామకృష్ణ తన సిబ్బందితో మాటు వేసి గంజాయితో మోటారు సైకిల్‌పై వెళుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన ముగ్గురి వివరాలు తెలుసుకుని ఐదురురిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వారి నుంచి 4 కేజీల గంజాయితో పాటు ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఆయన తెలిపారు.