
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్టు
సామర్లకోట: పట్టణంలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీఐ ఎ.కృష్ణభగవాన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ప్రత్యేక నిఘాలో భాగంగా స్థానిక కొత్త వంతెన సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఇంటి దొంగతనాలు చేస్తున్న అంతర్ జిల్లా నేరస్తుడిగా అంగీకరించినట్లు చెప్పారు. నిందితుడు కంచర్ల మోహనరావు నుంచి ఇప్పటివరకు నాలుగు దొంగతనాలకు సంబంధించి సుమారు 50 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండిని రివకరీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు అతడిని మంగళవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారన్నారు. ఇంటి యజమానులు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అదే విధంగా పోలీసు శాఖ అందిస్తున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను వినియోగించుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో క్రైమ్ సీఐ అంకబాబు, ఎస్సై రమేష్‌బాబు పాల్గొన్నారు.