
భర్త అనుమానించాడని భార్య ఆత్మహత్యాయత్నం
అమలాపురం రూరల్: భర్త అవమానించాడని మనస్తాపం చెంది మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాలూకా ఎస్‌ఐ వై.శేఖరబాబు తెలిపిన వివరాల మేరకు స్థానిక హైస్కూల్ సెంటర్‌కు చెందిన దూనబోయిన రమేష్‌కు రూరల్ మండలం నల్ల మిల్లి రాజీవ్ గృహకల్పకు చెందిన శ్యామలతో వివాహం జరిగింది. వివాహమైన కొద్దికాలానికే అతడు ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. ఎనిమిది నెలల క్రితం స్వగ్రామానికి తిరిగివచ్చి తనకు తెలిసిన సెంట్రింగ్ పని చేసుకుని జీవిస్తున్నాడు. గల్ఫ్‌లో ఉండగానే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఈ నెల 14న నేదునూరు పెదపాలెంలో పెద్దల సమక్షంలో తగువు పెట్టారు. కాపురానికి తీసుకువెళ్లనని గ్రామపెద్దల వద్ద రమేష్ చెప్పడంతో సోమవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన శ్యామల ఇంట్లో ఉన్న గడ్డిమందును తాగేసింది. వెంటనే గుర్తించిన తల్లి గడ్డి మందు సీసాను పక్కకు గెంటేసింది. అయితే అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న శ్యామలను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో మంగళవారం శ్యామల ఇచ్చిన సమాచారం ఆధారంగా భర్త రమేష్ కుటుంబసభ్యులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్‌బాబు తెలిపారు.