గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ | - | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ

Jul 16 2025 3:33 AM | Updated on Jul 16 2025 3:33 AM

గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ

గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ

ప్రీమియం చెల్లింపులు ఇలా..

పంటల బీమా ప్రీమియం

రైతులే చెల్లించాలని

కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు

వరికి ఎకరానికి రూ.576,

అరటికి రూ.3,000

చెల్లించాలని ఉత్తర్వులు

గతంలో రైతుల తరఫున

చెల్లించిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

జిల్లావ్యాప్తంగా 88 వేల

హెక్టార్లలో వివిధ పంటల సాగు

సాక్షి, రాజమహేంద్రవరం: తాము అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి పాటుపడతామని హామీలు గుప్పించిన కూటమి నేతలు గద్దెనెక్కిన అనంతరం విస్మరించారు. ఇప్పటికే పంటసాగుకు అవసరమైన ‘అన్నదాత సుఖీభవ’ పెట్టుబడి సాయం చేయకపోగా.. ఉచిత పంటల బీమా ప్రీమియం భారం రైతుల నెత్తిన వేశారు. రబీ ధాన్యం విక్రయాలకు సంబంధించి డబ్బు జమ అవ్వక.. ప్రకృతి విపత్తులతో అల్లాడుతున్న రైతులకు బీమా ప్రీమియం చెల్లింపు గుదిబండగా మారుతోంది.

ఇదీ సంగతి..

ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టం వాటిల్లకుండా పరిహారం అందించేందుకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా (పీఎంఎఫ్‌బీవై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌) పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో దిగుబడి ఆధారిత పీఎంఎఫ్‌బీవై కింద వరి, మిర్చి, మొక్కజొన్న, పెసర పంటలను, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌ కింద పత్తి పంటలను గుర్తించింది. వరికి గ్రామం యూనిట్‌గా.. మిర్చి, మొక్కజొన్న, పెసర పంటలను జిల్లా యూనిట్‌గా ఎంపిక చేసింది. ఇందుకుగాను ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఇఫ్కో టోకియో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను ఎంపిక చేశారు. కౌలు రైతులు సైతం బీమాకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. బీమా పొందాలంటే రైతువాటాగా నిర్ధారించిన ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంది.

బీమా ప్రీమియంకు మంగళం

‘ఉచిత పంటల బీమా’ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రీమియం సొమ్ము రైతులే చెల్లించాలన్న నిబంధన తెరపైకి తెచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్‌లో సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ పరిణామం రైతుల్లో ఆవేదన నింపుతోంది. అప్పులు చేసి సాగు చేస్తుంటే.. ప్రభుత్వం తమకు ఏ మాత్రం ప్రోత్సాహం అందించడం లేదని ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలో ఇలా..

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో సుమారు 83,068 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. ఇందులో అత్యధికంగా వరి 76,941 హెక్టార్లు, మినుములు 2,595 హెక్టార్లు, చెరకు 1,480, వేరుశనగ 258, పత్తి 502, కందులు, పెసలు, పసుపు 416, అరటి 6,000 హెక్టార్లలో సాగవుతాయి. పంటల బీమా వర్తించాలంటే ప్రతి రైతు ప్రీమియం చెల్లించాలి. సహకార బ్యాంకులతో పాటు వాణిజ్య బ్యాంకులు రైతుకు ఇచ్చే రుణం నుంచి ప్రీమియం సొమ్ము మినహాయించుకుంటాయి. రుణాలు తీసుకోని రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

రూ.14.80 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో మిచాంగ్‌ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 15,615 మంది రైతులకు సంబంధించి 10,487.02 హెక్టార్లలో ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం మరో ఆలోచన చేయకుండా రైతులకు అండగా నిలిచింది. నష్టపోయిన పంటలకు సాయంగా రూ.14.80 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేసింది.

గతంలో రూపాయి కూడా వసూలు చేయని వైనం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2019 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ–క్రాప్‌ నమోదు ప్రామాణికంగా ఉచిత పంటల బీమాను అమలు చేశారు. రైతులు సాగు చేసే మొత్తం విస్తీర్ణానికి చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా పథకం వర్తించడంతో పంటలకు నష్టం వాటిల్లిన ప్రతి సందర్భంలోనూ రైతులు పూర్తిగా నష్టపరిహారం అందుకునే వారు. కౌలు రైతులకు సైతం పరిహారం అందించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాలకే సొమ్ము జమ అయ్యేది. గత ఐదేళ్ల వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో బీమా ప్రీమియంగా రూపాయి కూడా చెల్లించని రైతులు ఇప్పుడు ప్రీమియం చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల సాగుకు ఇప్పటికే పెట్టుబడులు అందక అప్పులు చేశారు. ఇలాంటి సమయంలో బీమా భారం తమపై మోపడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని నిట్టూరుస్తున్నారు.

2024–25 రబీ సీజన్‌కు ప్రభుత్వం గుర్తించిన పంటలకు బీమా ప్రీమియం చెల్లింపునకు ఉత్తర్వులు వెలువరించింది. జిల్లాలో వరికి ఆగస్టు 15వ తేదీ, మినుములు జూలై 31, అరటికి జూలై 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. వరి పంట హెక్టారు రూ.95,000 విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,425 ప్రీమియం చెల్లించాలని సూచించింది. మినుములు, పెసలు హెక్టారుకు రూ.50 వేలు విలువ కట్టి 1.5 శాతం వంతున హెక్టారుకు రూ.750 ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. జీడితోటలకు హెక్టారుకు రూ.75 వేలుగా నిర్ధారించి 5 శాతం వంతున అంటే రూ.3,750 ప్రీమియం చెల్లించాలని తెలిపింది. అరటికి హెక్టారుకు రూ.7,500 చెల్లించాల్సి ఉంది.

రైతులపై రూ.34.50 కోట్లకు పైగా భారం

కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా రైతులపై సుమారు రూ.34.50 కోట్లకుపైగా బీమా ప్రీమియం భారం పడనుంది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో వరి 76,941 హెక్టార్లలో సాగవుతుంది. ప్రతి హెక్టారుకు రూ.1,425 చొప్పున రైతులు ప్రీమియం చెల్లించాలంటే.. సుమారు రూ.10.96 కోట్లు, మినుములు రూ.19 లక్షలు, అరటి రూపంలో రూ.4.50 కోట్లు భారం పడనుంది.

పంట వర్తింపజేసిన

ఇన్‌పుట్‌ సబ్సిడీ

(హెక్టారుకు)

వరి, వేరుశనగ, పత్తి, చెరకు రూ.17,000

మొక్కజొన్న రూ.12,500

మినుములు, పెసలు, శనగలు,

ప్రొద్దుతిరుగుడు, పొగాకు రూ.10,000

జొన్న రూ.8,500

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement