మడి.. తడారి.. | - | Sakshi
Sakshi News home page

మడి.. తడారి..

Jul 14 2025 4:43 AM | Updated on Jul 14 2025 4:43 AM

మడి..

మడి.. తడారి..

కృష్ణాకు నీరు తీసుకెళ్లాలనే తహతహ

పోలవరం కుడి కాలువ పొంగి ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కాలువలో నీటి ప్రవాహం ఉంది. కృష్ణాకు నీరు తీసుకు వెళ్లాలనే ప్రభుత్వం తహతహలాడుతోంది. వర్షాలకు రైతులు నాట్లు వేశారు. ప్రస్తుతం కాలువకు నీరు ఇవ్వక పోవడంతో చేలు దెబ్బ తింటున్నాయి. పోలవరం కాలువ పొంగుతుండగా, తాడిపూడి ఎండిపోయింది. కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తే పంటలు కోలుకుంటాయి.– సత్తి జగదీశ్వరరెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం, గోపాలపురం నియోజకవర్గం

ఇదీ.. తాడిపూడి..

తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి తీరాన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మన జిల్లా మెట్ట ప్రాంతంలోని కొవ్వూరు, గోపాలపురంతో పాటు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, నిరుపయోగంగా ఉన్న భూములను ఈ పథకం ద్వారా సాగులోకి తీసుకు రావాలని లక్ష్యంగా నిర్దేశించారు. సుమారు రూ.400 కోట్లతో ఈ పథకం పనులు పూర్తి చేశారు. ప్రధాన కాలువపై 4 సబ్‌ లిఫ్టులు ఏర్పాటు చేశారు. 2008లో పనులు పూర్తి కాగా, నాటి సీఎం వైఎస్సార్‌ నీటిని విడుదల చేశారు. 11 మండలాల్లో సుమారు 78 కిలోమీటర్ల పొడవున తాడిపూడి కాలువ విస్తరించి ఉంది. ప్రధాన పంపు హౌస్‌ వద్ద 8 మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో 6 మోటార్లను వినియోగించి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం కాగా, వైఎస్‌ తదనంతరం వచ్చిన ప్రభుత్వం కాలువ పనులు పూర్తి చేయలేదు. దీనికితోడు ప్రధాన కాలువ గట్లు బలహీనంగా ఉండటం వంటి కారణాలతో అధికారుల లెక్కల ప్రకారం 1.56 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేస్తున్నారు.

దేవరపల్లి మండలం బందపురం వద్ద ఏర్పాటు చేసిన తాడిపూడి ఎత్తిపోతల పథకం 5వ సబ్‌ లిఫ్టు

తాడిపూడి ఆయకట్టులో

ఎండిపోతున్న చేలు

ఈ నెల 3న హడావుడిగా

నీరు విడుదల చేసిన మంత్రి

ఆ వెంటనే

మోటార్లు ఆఫ్‌ చేసిన అధికారులు

దేవరపల్లి సబ్‌లిఫ్ట్‌

మరమ్మతుల పేరుతో కాలయాపన

కాలువకు విడుదల కాని నీరు

ఆయకట్టులో దెబ్బ తింటున్న వరి చేలు

తగ్గిన భూగర్భ జలాలు

రైతుల గగ్గోలు

దేవరపల్లి: సకాలంలో నీరు ఇవ్వకపోవడంతో వేసిన వరి చేలు ఎండిపోతున్నాయని, వెంటనే కాలువకు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజుల గడచినా ఇంత వరకూ కాలువకు నీరు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి చెంతనే ఉన్న తమ భూములకు చుక్క నీరు ఇవ్వకపోగా, ఎక్కడో ఉన్న కృష్ణా, రాయలసీమ రైతులకు పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా నీరు విడుదల చేయడం విడ్డూరంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. కాలువకు నీరు విడుదల చేసినట్టే చేసి, నిలిపివేయడంతో తాడిపూడి ఆయకట్టు పొలాల్లో వరి చేలు ఎండిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇంత వరకూ నాట్లు కూడా పడని దుస్థితి నెలకొంది. మరోవైపు బోర్ల కింద వేసిన చేలకు సైతం పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. భూగర్భ జలాలు 10 నుంచి 15 అడుగులకు పడిపోవడంతో బోర్ల నుంచి నీరు తక్కువగా వస్తోందని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు కొద్ది రోజులుగా వేసవిని తలపించేలా ఎండలు కాస్తూండటంతో చెరువులు, బోర్ల కింద వేసిన వరి ఆకుమడులు దెబ్బ తింటున్న పరిస్థితి నెలకొంది. మంత్రి స్వయంగా నీరు విడుదల చేసినా.. కాలువలో జలకళ కానరాకపోవడంతో రైతులు డీలా పడుతున్నారు. ఒకపక్క ఎండిపోతున్న చేలను, మరోవైపు నీరు లేక వెలవెలబోతున్న కాలువను చూచి ఆవేదన చెందుతున్నారు.

చుక్క నీరు లేని తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ

చుక్క నీరు లేక..

ఈ చిత్రం చూడండి. ఇది తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ. ఈ పథకం నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఈ నెల 3న ఆర్భాటంగా సాగునీరు విడుదల చేశారు. ‘రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్‌డీఏ ప్రభుత్వం పని చేస్తుంది. రైతులకు సకాలంలో సాగునీటిని అందజేస్తాం’ అంటూ అప్పట్లో మంత్రి గొప్పగా చెప్పారు కూడా. ఇది జరిగి అప్పుడే పది రోజులు గడిచింది. ఈపాటికే ఈ కాలువ నిండుగా ప్రవహించాలి. కానీ, చుక్క నీరు కూడా రావడం లేదు. మంత్రి మోటార్లు ఆన్‌ చేసి అలా వెళ్లగానే అధికారులు వెంటనే మోటార్లు ఆఫ్‌ చేసి, నీటి విడుదలను నిలిపివేశారు. కాలువ, సబ్‌ లిఫ్టుల నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయించని ప్రభుత్వ అసమర్థతే దీనికి కారణం. దేవరపల్లి సబ్‌ లిఫ్టు మరమ్మతులు పూర్తయితే తప్ప నీరు విడుదల చేసేది లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరిలో 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. అయినప్పటికీ తాడిపూడి కాలువలో నీరు ప్రవహించకపోవడంతో ఆయకట్టులో చేలు ఎండిపోతున్నాయి.

గోదావరి జలాలు

కృష్ణార్పణం

ఈ చిత్రం కూడా చూడండి. ఇది తాడిపూడి కాలువ గట్టును ఆనుకునే ఉన్న పోలవరం కుడి కాలువ. పక్కనే ఉన్న తాడిపూడి కాలువలో చుక్క నీరు లేకపోగా.. పోలవరం కుడి కాలువ మాత్రం గోదావరి జలాలతో నిండుకుండను తలపిస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలించుకుపోతున్నారు. ఈ కాలువ నిర్మాణం కోసం కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చిన తమకు నీరు ఇవ్వకుండా.. ఎక్కడో ఉన్న కృష్ణా జిల్లాకు పది రోజులుగా నీరు తరలించుకుపోతున్నారని స్థానిక రైతులు ఆక్షేపిస్తున్నారు. తమ పంటలను ఎండబెట్టి, అక్కడి రైతులు మాత్రమే పచ్చగా ఉండాలని ప్రభుత్వం తాపత్రయపడటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఖరీఫ్‌ ప్రారంభమై నెల రోజులు దాటినా ఇప్పటి వరకూ నీరు ఇవ్వకపోతే పంటలు ఏవిధంగా సాగు చేయగలమని ఆవేదన చెందుతున్నారు.

మడి.. తడారి..1
1/4

మడి.. తడారి..

మడి.. తడారి..2
2/4

మడి.. తడారి..

మడి.. తడారి..3
3/4

మడి.. తడారి..

మడి.. తడారి..4
4/4

మడి.. తడారి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement