
తగ్గుతున్న గోదావడి
ఫ నేడు మరింత తగ్గే అవకాశం
ఫ కడలిలోకి 6.14 లక్షల క్యూసెక్కులు
ధవళేశ్వరం: వరద గోదావరి తగ్గుముఖం పడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి ఉధృతి తగ్గడంతో ఆదివారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా ఉరవడి తగ్గింది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద ఉదయం అత్యధికంగా 6,56,341 మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. రాత్రికి నీటి ఉధృతి తగ్గడంతో మిగులు జలాల విడుదలను తగ్గించారు. రాత్రి 6,14,762 క్యూసెక్కుల నీటిని కడలిలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి సోమవారం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం రాత్రి 10.90 అడుగులుగా ఉంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 30.60 అడుగులకు తగ్గింది.
ఎగువన గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో..)
కాళేశ్వరం 7.32
పేరూరు 11
దుమ్ముగూడెం 8.72
కూనవరం 14.78
కుంట 6.20
పోలవరం 10.59
రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 15.09
అత్యవసర సహాయానికి సంప్రదించండి
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి వరద తగ్గుముఖం పట్టిందని, అయినప్పటికీ అత్యవసర సహాయం కావాల్సి వస్తే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 112, 1070, 1800 425 0101 నంబర్లలో సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామని తెలిపారు. వరద పూర్తి స్థాయిలో తగ్గేంత వరకూ నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్లరాదని, చేపలు పట్టడం, ప్రయాణించడం, స్నానాలకు వెళ్లడం వంటివి చేయరాదని ప్రఖర్ జైన్ సూచించారు.