
కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి హేయం
రాజమహేంద్రవరం సిటీ: కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, బీసీ మహిళ అయిన ఉప్పాల హారికపై తెలుగుదేశం గూండాలు రాళ్ల దాడికి తెగబడడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్తూంటే రాళ్లతో దాడి చేయడం, అది కూడా పోలీసుల సమక్షంలో జరగడం చూస్తూంటే, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నా మా అనే అనుమానం కలుగుతోందన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్ సీపీ శ్రేణులపై ఏడాదికి పైబడి వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారని మండిపడ్డారు. వేలాది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారని, భవిష్యత్‌లో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాలని భరత్‌రామ్ హెచ్చరించారు. ఎల్లకాలం ఒకరే అధికారంలో ఉండబోరనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఉప్పాల హారికకు తాము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే అండగా నిలబడతామని భరోసా కూడా ఇచ్చారని భరత్‌రామ్ అన్నారు.
ఇకపై కఠినంగా ప్లాస్టిక్ నిషేధం
రాజమహేంద్రవరం సిటీ: నగరంలో ఇకపై ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ పి.ప్రశాంతి ఆదివారం తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌పై ఉన్న నిషేధాన్ని ఉల్లఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 75 మైక్రాన్ల లోపు మందం ఉండే ప్లాస్టిక్ కవర్లతో పాటు ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పలుచని ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, అలంకరణకు వాడే థర్మకోల్ తదితర వస్తువులపై నిషేధం ఉందని వివరించారు. ఈ నిబంధనలను అతిక్రమించే వారు శిక్షార్హులని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా చేటు చేస్తోందన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన ప్రజలు ఎన్నో రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం అమలుపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులతో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకందారులు, నిల్వ చేసేవారు, పంపిణీదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, లేకుంటే చట్ట ప్రకా రం చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధించడమే కాకుండా ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు ఇకపై క్లాత్, జ్యూట్ బ్యాగ్‌లే వినియోగించాలన్నారు.
ఏలేరు ఆయకట్టుకు నీరు విడుదల
ఏలేశ్వరం: ఖరీఫ్ సాగుకు ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆదివారం 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా పెరిగాయి. ఎగువ నుంచి 1,357 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా 77.47 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.68 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. విశాఖకు 150, తిమ్మరాజు చెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.

కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి హేయం