
నాలుగు రోజులు ఇలాగే ఉంటే..
తాడిపూడి కాలువ కింద వరి చేలు ఎండిపోతున్నాయి. కాలువకు నీరు విడుదల చేయడంతో నాట్లు వేశాం. మూడు మోటార్ల కింద 20 ఎకరాల్లో వరి పంట వేశాను. ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు పడిపోయి నీరు తక్కువగా వస్తోంది. ఇక్కడి రైతులకు నీరు ఇవ్వకుండా పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణాకు తీసుకు వెళుతున్నారు. గోదావరి చెంతనే ఉన్న పంటలకు నీటి సమస్య ఏర్పడింది. పరిస్థితి మరో నాలుగు రోజులు ఇలాగే ఉంటే ఊడ్చిన చేలు ఎందుకూ పని చేయవు. సమస్య చెబుదామంటే అధికారులు ఫోన్ తీయడం లేదు.
– కలగర భూపతిరావు, రైతు, కరుకూరు, దేవరపల్లి మండలం
భూగర్భ జలాలు తగ్గాయి
ఇంత వరకూ తాడిపూడి కాలువకు నీరు విడుదల చేయలేదు. ఈ ఏడాది వర్షాలు కూడా తక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు తగ్గాయి. బోర్లు సరిగా తోడటం లేదు. బోర్ల కింద వేసిన వరి నాట్లు నీరు లేక దెబ్బ తింటున్నాయి. కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తే అన్ని పంటలకూ మేలు జరుగుతుంది. ఆయకట్టుకు నీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి బోర్లు సమృద్ధిగా నీరు తోడతాయి. ప్రధాన కాలువ పనులు పూర్తి కావలసి ఉన్నాయి. పంట కాలువలు లేవు. కాలువ గట్లు వర్షాలకు గండ్లు పడి బలహీనంగా ఉన్నాయి. కాలువను ఆధునీకరించి, గట్టు పటిష్టం చేసి, పంట బోదెలు ఏర్పాటు చేయాల్సి ఉంది. – మల్లిన వెంకటేశ్వరరావు, రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం
మరమ్మతులు జరుగుతున్నాయి
తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద దేవరపల్లి వద్ద ఉన్న సబ్ లిఫ్టు మరమ్మతులు ప్రస్తుతం జరుగుతున్నాయి. పంపు హౌస్‌లోకి వర్షపు నీరు వెళ్లి మోటార్లు మట్టితో పూడుకుపోయాయి. ఆ మట్టి తొలగింపు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం వద్ద మూడు మోటార్ల ద్వారా నీరు ఎత్తిపోస్తున్నాం. 26వ కిలోమీటరు వరకూ నీరు సరఫరా అవుతోంది. రెండు రోజుల్లో కాలువకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేస్తాం. ఈ సీజన్‌లో 1.60 లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం.
– రామేశ్వర నాయుడు,
డీఈఈ, తాడిపూడి ఎత్తిపోతల పథకం

నాలుగు రోజులు ఇలాగే ఉంటే..

నాలుగు రోజులు ఇలాగే ఉంటే..