
కూటమి పాలనలో దళితులకు రక్షణ కరవు
● బాధిత మహిళను స్థానిక ఎమ్మెల్యే
పరామర్శించకపోవడం దారుణం
● మాజీ హోం మంత్రి తానేటి వనిత
అనపర్తి: కూటమి ప్రభుత్వ హయాంలో దళితులకు అందున మహిళలకు రక్షణ కరవైందని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. దుప్పలపూడి గ్రామానికి చెందిన దళిత మహిళ కొమ్ము బుజ్జిపై పాశవిక దాడి జరిగి, వారం రోజులు కావస్తున్నా బాధితురాలిని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కనీసంగా కూడా పరామర్శించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. గ్రామానికి చెందిన టీడీపీ నేత నల్లమిల్లి వెంకటరెడ్డి సెటిల్‌మెంట్ వ్యవహారంలో దాడికి గురై, అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ కొమ్ము బుజ్జిని వనిత శనివారం పరామర్శించారు. ఆమెతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి కూడా బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వనిత, చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అధికార పార్టీ నాయకులు పెత్తందారీ పోకడలకు పోతున్నారని విమర్శించారు. రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఇంటికి వస్తున్న తనపై.. తమ మాట వినలేదనే కక్షతో సుమారు 15 మంది దారి కాచి, వీధి లైట్లు ఆర్పివేసి, రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించారని బాధిత మహిళ కొమ్ము బుజ్జి చెబుతోందని అన్నారు. అయినప్పటికీ పోలీసులు ఆమె రోదనను పట్టించుకోకుండా.. సంబంధం లేని సెక్షన్లు పెట్టి, కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఇదంతా చూస్తూంటే తన అనుచరులను కాపాడుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే ఒక పతకం ప్రకారమే ప్రజల్లో భయాందోళనలు సృష్టించి పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు.. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ రెడ్‌బుక్ పట్టుకుని తిరుగుతూంటే.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా వారి బాటలోనే అమాయక ప్రజలపై దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రాణభయంతో ఆందోళన చెందుతున్న బాధిత మహిళకు, ఆమె కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని, అలాగే కేసులోని సెక్షన్లు మార్చి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.