
సమన్వయంతో సత్వర న్యాయం
రాజమహేంద్రవరం రూరల్: సమన్వయంతో సత్వర న్యాయం లభించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆధ్వర్యాన నగరంలో శనివారం కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది నమోదైన కేసులపై వివిధ శాఖలను సమన్వయపరిచేలా ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఈ అర్ధ సంవత్సర సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసు కేసుల దర్యాప్తులో ప్రముఖ పాత్ర పోషించే న్యాయ, రెవెన్యూ, మెడికల్, మునిసిపల్, ఫోరెన్సిక్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, నేషనల్ హైవే అథారిటీ, ఎకై ్సజ్, జైళ్లు, రైల్వే, విద్య, ఏపీఎస్ ఆర్టీసీ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో పోలీసు శాఖ నిత్యం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయా శాఖల ఉన్నతాధికారులు చెప్పారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాఽధికారులను ఎస్పీ నరసింహ కిషోర్ సత్కరించారు. సబ్ డివిజన్ల వారీగా పనితీరు, డ్రోన్ కెమెరాల ప్రత్యేక స్టాల్స్ ఆహూతులను ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం, ఈ సంవత్సరం ఇప్పటి వరకూ నమోదైన కేసులపై జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ కూలంకషంగా చర్చించారు. వచ్చే అర్ధ సంవత్సర కార్యాచరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. గడచిన అర్ధ సంవత్సరంలో వివిధ కేసుల పరిష్కారంలో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ సత్కరించారు. సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.