
వైద్య, ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వైద్య, ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఇది ప్రజలకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు పి.గిరప్రసాద్‌వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సంఘం జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది. వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖలో కొన్ని వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశాబ్దాల నుంచి సిబ్బంది ప్యాటర్న్ మారలేదని, దీనిని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని ఆసుపత్రుల్లో వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందడం లేదని చెప్పారు. కేవలం కొద్దిమంది కాంట్రాక్టు నర్సులు మాత్రమే ఉన్నారని, పలువురు నర్సులు అవసరమని తెలిపారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అతి ముఖ్యమైన ధోబీ, బార్బర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ పోస్టులు ఎత్తివేశారని చెప్పారు. అదనంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించాలన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఒకప్పుడు ఇరవై ముప్పై మంది మాత్రమే అవుట్ పేషెంట్లు ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 300కు చేరిందని, కానీ అందుకు తగినట్టుగా సిబ్బంది పెరగలేదని చెప్పారు.