
శిష్యుడినని నమ్మించి శఠగోపం
● గురువు ఇంటికి సమీపంలోనే
అద్దెకు దిగి అదను చూసి చోరీ
● రూ.50 లక్షల విలువైన
బంగారు ఆభరణాలు అపహరణ
● నాలుగు రోజుల్లో నిందితుడిని
అరెస్టు చేసి సొత్తు రికవరీ
అమలాపురం టౌన్: నేను మీ వద్దే చదువుకున్నానని.. ఆ ఉపాధ్యాయుడి ఇంటి పక్కనే మరో ఇంటిలో అద్దెకు దిగిన పూర్వ విద్యార్థి గురువు ఇంటికే కన్నం వేసి విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు శనివారం విలేకరుల సమావేశంలో ఈ ఘటన వివరాలను వెల్లడించారు. రామచంద్రపురం పట్టణం రామదుర్గా వీధిలో ఓ డాబా ఇంట్లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు దొంతంశెట్టి శ్రీనివాస్ నివసిస్తున్నారు. దేవగుప్త వీరబ్రహ్మం అనే 30 ఏళ్ల యువకుడు ఆయన విద్యార్థినని పరిచయం చేసుకుని ఆయన ఇంటికి సమీపంలోనే మరో ఇంటిలో అద్దెకు దిగాడు. ఈనెల మూడున ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి కుటుంబంతో విశాఖపట్నం బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా వీరబ్రహ్మం ఇంటిలోని తలుపు బోల్టును పగలగొట్టి రూ.50 లక్షల విలువైన 463 గ్రాముల బంగారాన్ని దోచుకుని ఉడాయించాడు. ఈ నెల ఏడో తేదీన విశాఖ నుంచి తిరిగి వచ్చిన శ్రీనివాస్ తన ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి, సీసీ కెమేరా ఫుటేజీల సాయంతో చోరీకి పాల్పడిన వీరబ్రహ్మంను అరెస్టు చేసి అతని నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
పోలీసులకు ఎస్పీ అభినందనలు
కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి సొత్తును రికవరీ చేసిన రామచంద్రపురం డీఎస్పీ బి.రఘువీర్, సీఐ ఎం.వెంకట నారాయణ, క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, రామచంద్రపురం ఎస్సై నాగేశ్వరరావు, ద్రాక్షారామ ఎస్సై లక్ష్మణ్, క్రైమ్ ఏఎస్సై అయితాబత్తుల బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ వీరబాబు, కానిస్టేబుళ్లు ఏసుకుమార్, సూరిబాబు, అనిల్ కుమార్, లోవరాజు, అర్జున్, ఐటీ కోర్ కానిస్టేబుల్ జాఫర్‌లను ఎస్పీ కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డులు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.