
వాడపల్లి క్షేత్రం జన సంద్రం
దేవస్థానం ఆదాయం రూ.62.53 లక్షలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న ఆలయం శనివారం జనసంద్రమైంది. అంతకంతకూ భక్తజనం పెరుగుతుండడంతో కోనసీమ తిరుమలగా ఈ క్షేత్రం ప్రఖ్యాతమవుతోంది. శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి ఆశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేసి విశేషంగా అలంకరించారు. సాధారణ భక్తులతో పాటు శ్రీఏడు శనివారాలశ్రీ నోము ఆచరిస్తున్న భక్తులతో వాడపల్లి క్షేత్రం కిక్కిరిసిపోయింది. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్నప్రసాద విరాళం, సేవలు, లడ్డూ విక్రయం, ఆన్‌లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి రూ.62,52,971 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.