
రేపటి నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీలకు శిక్షణ
సామర్లకోట: ఉమ్మడి జిల్లాలోని మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందని ప్రిన్సిపాల్ కరుటూరి నాగ వరప్రసాదరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాయకత్వ శిక్షణలో భాగంగా మార్పు ద్వారా విజేతలు పేరిట గత నెల 23 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీలకు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాల సిబ్బంది శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 67 మందికి స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తామన్నారు. మహిళా ప్రతినిధులకు నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విధులు–బాధ్యతలు, భావవ్యక్తీకరణ వంటి అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణకు హాజరై సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుందన్నారు.